అర్జున్, మలైకా విడిపోతున్నారా?

బాలీవుడ్ జంటల్లో అర్జున్ కపూర్, మలైకా అరోరాలది చిత్రమైన బంధం. అర్జున్ వయసేమో 36 ఏళ్లు. మలైకాకేమో 48 ఏళ్లు నిండిపోయాయి. అర్జున్ టీనేజీలో ఉండగానే మలైకాకు పెళ్లయి పిల్లలు కూడా పుట్టారు. బాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీ అయిన సలీం ఖాన్ కుటుంబంలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడి అతడితో ఇద్దరు పిల్లల్ని కని వాళ్లు టీనేజీలో ఉండగా వైవాహిక బంధానికి తెరదించిన మలైకా.. అర్జున్ కపూర్‌తో చాలా ఏళ్ల నుంచి సహజీవనం చేస్తోంది.

ముందు ఈ జంట తమ బంధాన్ని బహిరంగ పరచడానికి ఇష్టపడలేదు. దీంతో నిజంగా వీళ్ల మధ్య ఎఫైర్ ఉందా అని సందేహించిన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ కొన్నేళ్ల నుంచి వీళ్లు తమ రిలేషన్ విషయంలో ఏమీ మొహమాట పడట్లేదు. పెళ్లి చేసుకోలేదన్న మాటే కానీ.. భార్యాభర్తల్లాగే కలిసి తిరిగేస్తున్నారు.

కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు కూడా.ఐతే అర్జున్, మలైకాల మధ్య వయసు అంతరం.. ఇరువురి కుటుంబ పరిస్థితులను చూసి వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదమో అని చాలామందికి అనుమానాలు కలిగాయి. కొన్నేళ్లు కలిసున్నాక ఒకరి పట్ల ఒకరికి మోజు తగ్గి విడిపోతారని అంచనాలు వేసిన వాళ్లూ ఉన్నారు. అందుకు తగ్గట్లే ఇటీవల మీడియాలో వీరి బ్రేకప్ గురించి వార్తలు వచ్చాయి. ఐతే ఈ ఊహాగానాలకు అర్జున్ తనదైన శైలిలో తెరదించాడు.

మలైకాతో కలిసి ఉన్న ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తమ గురించి రూమర్లు పుట్టిస్తున్న వాళ్లను ఉద్దేశించి ఒక కామెంట్ కూడా చేశాడు. ‘‘రూమర్లకు ఇక్కడ తావు లేదు. అందరూ భద్రంగా ఉండండి. సంతోషంగా ఉండండి. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నా. మీకు నా ప్రేమ’’ అని పోస్ట్ చేశాడు అర్జున్. ఈ పోస్టుకు చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలు లైక్స్ కొట్టి ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. మరి అర్జున్-మలైకా ఎల్లప్పటికీ ఇంతే సంతోషంగా ఉంటూ తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.