మంత్రి మనసుకు మేకు కొట్టిన వర్మ

మీరు నా మనసుకు మేకు కొట్టారు.. ఇదీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సమావేశానికి వెళ్లినపుడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య. మనసుకు మేకు అంటే ఇదేమీ నెగెటివ్ కామెంట్ కాదట. రామ్ గోపాల్ వర్మ డ్రెస్సింగ్ చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయి చేసిన కామెంట్ ఇదట. ఇలాంటి వాక్య ప్రయోగం తాను ఇంత వరకు ఎక్కడా వినలేదని.. నాని తనను చూసి ఆ మాట అనేసరికి ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పాడు వర్మ.

మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశం కదా వర్మ కొంచెం పద్ధతిగా వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ వర్మ మాత్రం తనదైన శైలిలో ఒక స్టైలిష్ హుడీ, చిరుగుడు జీన్స్.. మెరుపులు మెరుస్తున్న షూస్ వేసుకుని వెళ్లాడు. ఈ డ్రెస్సింగ్ చూసి సోషల్ మీడియా జనాలు భలే ఎంజాయ్ చేశారు. ఎంతైనా వర్మ వర్మే అంటూ కామెంట్లు చేశారు.

ఐతే వర్మను చూసి మంత్రి, అధికారులు ఎలా స్పందిస్తారో అనుకుంటే.. నాని చాలా ఇంప్రెస్ అయి ‘‘మీరు నా మనసుకు మేకు కొట్టారు’’ అని కామెంట్ చేశాడట. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వర్మ ఈ విషయం వెల్లడించాడు.ఇక తన డ్రెస్సింగ్ గురించి తరచుగా నెగెటివ్ కామెంట్లు చేసే వారికి వర్మ ఈ సందర్భంగా సమాధానం చెప్పాడు.

తెల్లబట్టలేసుకుని, నీట్‌గా రెడీ అయ్యే వాళ్లు ఉత్తములు, అన్నీ మంచి పనులే చేస్తారు అనుకుంటే పొరబాటని.. అలాగే తన లాగా టీషర్ట్, చిరిగిన జీన్సులు వేసుకునే వాళ్ల ఆలోచనలు సరిగా ఉండవు అనుకుంటే అది మూర్ఖత్వమని వర్మ వ్యాఖ్యానించాడు. తాను వోడ్కా తాగినా, అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసినా, కిందపడి దొర్లుతూ వాళ్ల కాళ్లకు దండం పెట్టినా.. అవేవీ తన ఆలోచనల మీద ప్రభావం, పరిజ్ఞానం మీద ప్రభావం చూపించవని.. ఆహార్యానికి, తెలివికి అసలు సంబంధం లేదని జనాలు అర్థం చేసుకోవాలని వర్మ వ్యాఖ్యానించాడు.