బంగార్రాజు ప్రీక్వెల్ కాదు


సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీకి బంగార్రాజు సీక్వెలా ప్రీక్వెలా తెలియ‌క చాలామంది అయోమ‌యంలో ఉన్నారు. సోగ్గాడే..లో హైలైట్‌గా నిలిచిన బంగార్రాజు పాత్ర‌ను తీసుకుని దాని చుట్టూ క‌థ‌ను అల్లి ఈ సినిమా తీసిన సంగ‌తి వాస్త‌వం. ఐతే ఆ పాత్ర మీద సినిమా అన‌గానే దాని బ్యాక్ స్టోరీ నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుందేమో.. కాబ‌ట్టి ఇది ప్రీక్వెలేమో అన్న అభిప్రాయంతో అంద‌రూ ఉన్నారు.

కానీ బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయ‌నాకు ప్రీక్వెల్ కాద‌ని, సీక్వెల్ అని వెల్ల‌డించాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌. సోగ్గాడే చిన్నినాయ‌నా క‌థ ఎక్క‌డైతే ఆగిందో అక్క‌డే బంగార్రాజు క‌థ మొద‌ల‌వుతుంద‌ని అత‌ను తెలిపాడు. ఐతే ఇందులో బంగార్రాజు పూర్వ క‌థ కూడా ఉంటుంద‌ని.. త‌ర్వాత బంగార్రాజు మ‌న‌వ‌డిగా చైతూ ఎంట్రీ ఉంటుంద‌ని వెల్ల‌డించాడు. మీడియాలో ప్ర‌చారం జ‌రిగిన‌ట్లు చైతూది క్యామియో రోల్ కాద‌ని, పూర్తి స్థాయి పాత్రే అని తెలిపాడు క‌ళ్యాణ్‌. సినిమాల నాగ్, చైతూల పాత్ర‌లు స‌మాన స్థాయిలో ఉంటాయ‌న్నాడు.

సోగ్గాడే చిన్నినాయ‌నా చేయ‌డానికి ముందు తాను నాగార్జున‌ను వేరే క‌థ‌తో క‌లిశాన‌ని.. కానీ రామ్మోహ‌న్ రాసిన చిన్న క‌థ‌ను త‌న‌కు ఇచ్చి దాన్ని డెవ‌ల‌ప్ చేయించి సోగ్గాడే చిన్నినాయ‌నా తీయించార‌ని చెప్పాడు క‌ళ్యాణ్‌. సోగ్గాడే చిన్నినాయ‌నా రిలీజైన రోజే బంగార్రాజు చేయాల‌ని డిసైడ‌య్యామ‌ని.. కానీ త‌ర్వాత వేరే సినిమాలు చేయాల్సి రావ‌డంతో ఇది ఆల‌స్య‌మైంద‌ని, ఆ త‌ర్వాత స్క్రిప్టు ప‌క్కాగా రెడీ చేసుకుని గ‌త ఏడాది రంగంలోకి దిగామ‌ని.. సంక్రాంతి టార్గెట్‌గా ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ప‌ని చేసి అనుకున్న‌ట్లే పండ‌క్కి సినిమాను తీసుకొస్తున్నామ‌ని తెలిపాడు క‌ళ్యాణ్‌.