ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై కొన్ని రోజులుగా ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులు కొందరు ఘాటుగా మాట్లాడుతుంటే.. కొందరు సుతి మెత్తగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొందరు మౌనం వహిస్తున్నారు. ఐతే ఎంత లౌక్యం ప్రదర్శిద్దామని, వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిద్దామని చూసినా.. తమ సినిమాల ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు వచ్చిన ప్రముఖులను మీడియా వాళ్లు వదలట్లేదు. ఈ అంశం మీద సూటిగా ప్రశ్నలు అడిగేస్తున్నారు.
ఇప్పుడు సీనియర్ హీరో కమ్ ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జునను సైతం మీడియా వాళ్లు ఈ విషయమై గట్టిగా అడిగేశారు. తన కొత్త చిత్రం బంగార్రాజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం నాగ్ బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏపీలో టికెట్ల రేట్ల గొడవపై మీరేమంటారు అని మీడియా వాళ్లు నాగ్‌ను ప్రశ్నించగా.. ఇది సినిమా వేడుక అని, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడనని అనేశారు నాగ్. ఐతే సినిమా టికెట్ల గురించి అడిగితే ఇది రాజకీయ అంశం అంటాడేంటని అవాక్కవడం మీడియా వాళ్ల వంతయింది. నాగ్ అంతటితో ఆగకుండా టికెట్ల రేట్ల ప్రభావం తన సినిమా మీద ఉండదనడం ద్వారా ఏపీలో తగ్గించిన టికెట్ల రేట్ల వల్ల తనకే ఇబ్బందీ లేదన్నట్లు మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగించేదే.
ఏపీ సీఎం జగన్‌కు నాగ్ చాలా క్లోజ్ అని అంతా అంటారు. మరి ఆయన చొరవ తీసుకుని జగన్‌తో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడొచ్చనే అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఐతే సమస్య ఉంది, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అనకుండా.. అసలు టికెట్ల రేట్ల ప్రభావం తన సినిమాపై ఉండదని నాగ్ అనడమేంటో ఎవరికీ అంతు బట్టడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates