2021లో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సినిమా ‘పుష్ప’. డిసెంబరు 17న డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలను మించి సంచలనాలు సృష్టించింది. తెలుగులోనే కాక వేరే భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం చూసి అంతా విస్తుబోతున్నారు. రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ మూడో వారంలోనూ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోందీ సినిమా.
ఇలాంటి టైంలో ముందే చేసుకున్న ఒప్పందం మేర ఈ చిత్రాన్ని జనవరి 7నే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు రోజుల కిందట దీని గురించి వార్తలు వస్తే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఖండించింది. కానీ ఇప్పుడు చూస్తే ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జనవరి 7న ఈ చిత్రం ప్రైమ్‌లోకి రాబోతోంది. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచే సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నారు.
ఓటీటీ రిలీజ్ గురించే ముందే సమాచారం వస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందనే మైత్రీ వాళ్లు ఈ వార్తను ఖండించినట్లున్నారు. ఐతే జెర్సీ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వాయిదా పడటం కలిసొచ్చి సినిమా ఇప్పటికీ బాగా ఆడుతున్న నేపథ్యంలో డీల్ రివైజ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్రయత్నం కొంత మేరే ఫలించింది. ‘పుష్ప’ను 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.
హిందీలో ఈ సినిమా అంచనాల్ని మించి ఆడేస్తుండటం.. ‘83’ సినిమాను కూడా వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతుండటంతో వీలైనంత మేర మరింత వసూళ్లు రాబట్టుకోవడం కోసం ఆ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌ను హోల్డ్ చేసినట్లున్నారు. నార్త్‌లో థియేటర్లు పూర్తిగా మూతపడటమో, ‘పుష్ప’ జోరు తగ్గడమో జరిగాక ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అక్కడ ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉంది. థియేటర్లు మూత పడకుంటే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేకపోయేది.