RRR: మళ్లీ గొడవ తప్పదా?

హిందీ మూవీ ‘జెర్సీ’ వాయిదా పడగానే ఇక ‘ఆర్ఆర్ఆర్’ వంతు కూడా వచ్చినట్లే అని వారం కిందటే అందరూ ఆ సినిమా వైపు చూశారు. కానీ ముందు అనుకున్న ప్రకారమే జనవరి 7న విడుదల దిశగా అడుగులు వేసింది చిత్ర బృందం. ప్రమోషన్లను యధావిధిగా కొనసాగించారు. విదేశాల్లో టికెట్ల అమ్మకాలు కూడా కొనసాగాయి. ఇక్కడ రిలీజ్ సన్నాహాలనూ కొనసాగించారు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోయాయి.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, ఢిల్లీలో ఇప్ప‌టికే థియేట‌ర్లు మూత‌ప‌డ‌టం, ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో థియేటర్ల మీద ఆంక్షలు పెట్టబోతున్న సంకేతాలు రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం వెనక్కి తగ్గక తప్పలేదు. నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి రావడంతోనే దర్శకుడు రాజమౌళి మనసు మార్చుకోక తప్పలేదని తెలుస్తోంది. ముంబ‌యిలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో స‌మావేశమై వాయిదా నిర్ణ‌యం తీసుకున్నాడు జ‌క్క‌న్న‌. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

ఐతే ఇంతకీ ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్ ఏదన్నదే ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తున్న ప్రశ్న. ఈ చిత్రం రిలీజ్ డేట్ మార్చుకోవడం ఇది నాలుగోసారి. ఆ సినిమాను వాయిదా వేసి, కొత్త డేట్ ఎంచుకున్న ప్రతిసారీ వివాదం తప్పలేదు. 2021 సంక్రాంతి అన్నపుడు ఆ పండుగను అప్పటికే లక్ష్యంగా సినిమాలకు ఇబ్బంది అయింది. ఐతే కరోనా కారణంగా ఆ పండక్కి అనుకున్న ఏ సినిమాలూ రాలేదు. అక్టోబరు 13కు షెడ్యూల్ చేసినపుడు అప్పటికే ఆ డేట్‌కు అనుకున్న ‘మైదాన్’ టీం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇక జనవరి 7కి రిలీజ్ అంటే దీనిపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. రాజమౌళి ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొన్నాడు ఈటైంలో. ఇంతా చేసి మిగతా సినిమాలను వాయిదా వేస్తే.. ఈ డేట్‌కు కూడా ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ డేట్ మిస్సయిందంటే ఇక ఆటోమేటిగ్గా వేసవికే సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్ ఆరంభం నుంచి ప్రతి వారానికీ ఓ భారీ చిత్రం షెడ్యూల్ అయి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆ టైంలో వస్తే రెండు మూడు సినిమాలు డేట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ల నుంచి నిరసన తప్పకపోవచ్చు. అప్పుడు మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ టీంకు తలనొప్పి తప్పేలా లేదు.