సక్సెస్ సక్సెస్ సక్సెస్.. ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఇదే. ఎక్కడైనా సరే.. విజయం సాధించే వాళ్లకే విలువ ఉంటుంది. అందరూ సక్సెస్ అయిన వాళ్ల వెంటే పరుగులు పెడతారు. జీవితంలో గెలుపోటములు సహజమని.. ఓడినా కుంగిపోకూడదని.. ఓటమి మంచి పాఠాలు నేర్పిస్తుందని.. ఓడినపుడే జీవితం విలువ తెలుస్తుందని.. ఇలాంటి మాటలన్నీ మంచివే. ఓటమి పాలైనపుడు ముందుకు సాగడానికి ఇలాంటి మాటలే స్ఫూర్తినిస్తాయి.
కానీ సినీ రంగంలో పరాజయం ఎదురైతే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. మిగతా ఏ రంగంతో పోల్చినా ఇక్కడ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ సాధించే విజయానికి విలువ చాలా చాలా ఎక్కువ. అదే సమయంలో ఇక్కడ ఎదురయ్యే ఓటమి తాలూకు పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. ఈ అనుభవాలు సుకుమార్‌కు బాగా తెలుసు కాబట్టేనేమో తనకు ఫెయిల్యూర్ ఎదురైతే తట్టుకోలేనని.. తనకు సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఐతే తన ప్రతి సినిమా సక్సెస్ కావడం ఎందుకు ఇంపార్టెంటో సుకుమార్ తనదైన శైలిలో ఒక ఆసక్తికర లాజిక్ చెప్పాడు. మనం ఏ పని చేసినా ఫలితం గురించి ఆలోచించకుండా ఆ పనిని, మన ప్రయాణాన్ని ఆస్వాదించాలని అంటుంటారని.. కానీ అందరిలా తాను తన పనిని ఆస్వాదించలేనని సుకుమార్ చెప్పాడు. తాను ఒక సినిమాకు సంబంధించి పని మొదలైనప్పటి నుంచి చాలా కష్టపడతానని.. తన జర్నీని తాను ఎప్పుడూ ఆస్వాదించలేనని ఆయన తెలిపాడు.
ప్రతి సినిమాకూ ఇలాగే జరుగుతుందని.. చాలా కన్ఫ్యూజ్ అవుతూ, టెన్షన్ పడుతూ, కష్టపడుతూ సినిమా పూర్తి చేస్తానని.. కాబట్టి తన సినిమా హిట్టయితే ఆ ఆనందాన్ని మాత్రమే ఆస్వాదిస్తానని.. అందుకే తన సినిమాలు విజయవంతం కావడం తనకు చాలా ఇంపార్టెంట్ అంటూ.. తన ‘సక్సెస్ థియరీ’ని వివరించాడీ లెక్కల మాస్టారు. వ్యక్తిత్వ వికాస కోణంలో చూస్తే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాకపోవచ్చేమో కానీ.. సుకుమార్ మాత్రం ఈ థియరీని చాలా లాజికల్‌గానే చెప్పాడనడంలో సందేహం లేదు.