ఆంధ్రకింగ్ ‘అరటిపళ్ళు’ కథ నిజంగా జరిగింది

ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే కలయికలో తెరకెక్కిన ఆంధ్రకింగ్ తాలూకా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా ఏ స్థాయికి చేరుకుంటుందనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉన్న మూవీ ఇదొక్కటే. టాక్ కు తగ్గ రేంజ్ లో వసూళ్లు పెరగాల్సి ఉండగా ఆదివారం మీద ట్రేడ్ బోలెడు నమ్మకం పెట్టుకుంది. ఇదిలా ఉండగా ఒక హీరో, అభిమాని మధ్య బాండింగ్, ఎమోషన్ గొప్పగా ఆవిష్కరించిన దర్శకుడు మహేష్ బాబు కొన్ని సీన్లను తీర్చిదిద్దిన తీరు అందరి ఫ్యాన్స్ హృదయాలను టచ్ చేసింది. వాటిలో ఒకటి అరటిపళ్ళ ఎపిసోడ్.

సినిమాలో కథ ప్రకారం రామ్ ఉంటున్న ఊరికి దగ్గరలో ఉపేంద్ర షూటింగ్ జరుగుతుంది. తన హీరోకి చిన్న అరటిపళ్ళు అంటే ఇష్టమని తెలుసుకున్న రామ్ వాటిని అతి కష్టం మీద మధ్యలో వచ్చిన అడ్డంకులు దాటుకుని మరీ తీసుకొస్తాడు. ఈలోగా ప్యాకప్ అయిపోయి నిర్మాత తప్ప అందరూ వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ కొద్దిరోజుల తర్వాత మరోసారి అరటిపళ్ళు తీసుకెళ్లి ప్రొడ్యూసర్ కు ఇస్తాడు. అయితే ఇది దర్శకుడు మహేష్ బాబు నిజ జీవితంలో జరిగింది. ప్రజారాజ్యం క్యాంపైన్ టైంలో పవన్ కళ్యాణ్ కు అరటిపళ్ళు ఇష్టమని తెలుసుకున్న ఇతను వేళ కానీ వేళలో రాత్రి భోజనానికి వాటిని కష్టపడి సాధిస్తాడు.

తన రియల్ లైఫ్ లో జరిగిందే తీసుకుని మహేష్ బాబు ఈ సినిమాలో పెట్టాడు. ఇది బాగా కనెక్ట్ అయిపోయింది. నిజానికి ఆంధ్రకింగ్ తాలూకాలో చాలా సన్నివేశాలు స్థాయితో సంబంధం లేకుండా అందరి హీరోల అభిమానులను మెప్పించాయి. కారణం సహజత్వం. క్లైమాక్స్ లో డైలాగులు కూడా అదే తరహాలో ఉంటాయి. మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు పైన సంఘటనను వివరించారు. ఇకపై కూడా భావోద్వేగాలతో కూడిన మంచి కథలే తెరకెక్కిస్తానని చెబుతున్న మహేష్ బాబు నెక్స్ట్ ఎవరితో చేసేది ఇంకా ఫైనల్ కాలేదు. ఒక స్టార్ హీరోతోనే ఉండబోతోందనే టాక్ ఉంది పేరు మాత్రం ఇప్పటికి సస్పెన్సే.