ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్‌కీ ఉంటుంది. ఎందుకంటే సినిమా భారాన్ని మోయగలిగే అవకాశం రావడం అరుదు. ఒకవేళ వస్తే, అందులో సక్సెస్ అయితే రేంజ్ మారిపోతుంది. నటిగా ఎన్నో మెట్లు ఎదిగే అవకాశమూ ఉంటుంది. అందుకే హీరోయిన్లందరూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే చాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రద్ధా శ్రీనాథ్ కూడా చేసింది. ఓ సూపర్బ్ చాన్స్ కొట్టేసింది.
‘జెర్సీ’ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ శ్రద్ధ చాలా మంచి నటి అని పొడిగేశారు. అయితే ప్రశంసలు వచ్చినంతగా అవకాశాలైతే రాలేదు. కొన్ని సినిమాలు చేసినా కోరుకున్న స్థానానికి ఆమెని చేర్చలేదు. కానీ ఇప్పుడు తమిళంలో చేస్తున్న ఓ సినిమా తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందని నమ్ముతోంది శ్రద్ధ. ఆ సినిమాయే.. కలియుగం.
కొత్త దర్శకుడు ప్రమోద్ సుందర్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. కేఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. తాజాగా ఫైనల్ షెడ్యూల్ మొదలయ్యింది. శ్రద్ధపై కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదో అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ అని, ఇండియాలోనే తొలి అపోకలిప్ట్ మూవీ అని చెబుతున్నారు మేకర్స్. జనవరిలో షూటింగ్ కంప్లీటవుతుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇది కాకుండా ప్రస్తుతం శ్రద్ధ చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో రెండు కన్నడ, ఒక తమిళ చిత్రం ఉన్నాయి. ఇక నాలుగోది మోహన్‌లాల్ హీరోగా రూపొందుతున్న మలయాళ చిత్రం ‘ఆరట్టు’. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది శ్రద్ధ. అయితే ఇవన్నీ ఒకెత్తు, కలియుగం ఒకెత్తు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది కనుక హిట్టయితే క్రెడిట్ మొత్తం శ్రద్ధకే వెళ్తుంది. కెరీర్ టర్న్ అవుతుంది. అదే జరిగితే ఆమె టాలెంట్‌కి తగిన ఫలితం దక్కినట్టే.