మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న బాక్సాఫీస్ వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు కుటుంబాల హీరోలు స్నేహంగానే కనిపించినా.. అభిమానుల మధ్య మాత్రం ఎప్పట్నుంచో రైవల్రీ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆరే ఒక ఇంటర్వ్యూలో అంగీకరించడం గమనార్హం. ఐతే అతడికి రామ్ చరణ్‌తో ముందు నుంచి మంచి స్నేహం ఉన్నప్పటికీ ఆ బంధం గురించి బయటి జనాలకు పెద్దగా తెలియదు.
ఆర్ఆర్ఆర్ సినిమా మొదలయ్యాక వీరి స్నేహం మరో స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇద్దరూ బయటి జనాలకు కూడా ఆప్తమిత్రుల్లా కనిపిస్తున్నారు. తారక్, చరణ్ ఒకరి గురించి ఒకరు మాట్లాడేటపుడు ఇద్దరి మధ్య అనుబంధం ఏ స్థాయికి చేరిందో అర్థమవువుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో తారక్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ కొంత ఎమోషనల్ అయ్యాడు.
ఈ సినిమాకు పని చేసిన వారిలో ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెబుతూ వచ్చిన చరణ్.. ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి ఆగిపోయాడు. తారక్‌కు తాను థ్యాంక్స్ చెప్పను అనేశాడు. అతడికి థ్యాంక్స్ చెబితే తనతో అనుబంధానికి ముగింపు పలికినట్లు అనిపిస్తుందని.. కాబట్టే థ్యాంక్స్ చెప్పనని అతనన్నాడు. తారక్ బదులు అతడి లాంటి సోదరుడిని తనకిచ్చినందుకు తాను దేవుడికి థ్యాంక్స్ చెబుతానని చరణ్ అన్నాడు. ముందు నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని.. ఈ సినిమాతో తమ అనుబంధం ఇంకా బలపడిందని.. అతడితో కలిసి పని చేసిన ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదించానని చరణ్ తెలిపాడు.
ఈ క్రమంలోనే చరణ్ చేసిన ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ అందరికీ కదిలించేసింది. తారక్‌తో తన సోదర బంధం తన చివరి శ్వాస వరకు కొనసాగాలని ఆశిస్తున్నట్లుగా చరణ్ పేర్కొనడం విశేషం. ఈ మాట విని తారక్ చరణ్‌కు అభివాదం చేయడం ఆకట్టుకుంది. అంతకుముందు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చరణ్‌తో సమయం గడపడం కోసం ‘ఆర్ఆర్ఆర్’లో ప్రతి షాట్ మళ్లీ చేయాలని తనకుందని అన్నాడు. తమ కలయికకు సంబంధించి ఇది అంతం కాదని, ఆరంభం అని వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates