బాల‌య్య‌, బ్రాహ్మ‌ణి.. కేబీఆర్ పార్క్ గోడ దూకి

నంద‌మూరి బాల‌కృష్ణ పిల్లలు ముగ్గురూ కూడా మీడియాకు చాలా దూరంగా ఉంటారు. తేజ‌స్విని, మోక్షజ్ఞ అయితే ఇప్ప‌టిదాకా మీడియాతో మాట్లాడిన దాఖ‌లాలే లేవు. వాళ్ల‌తో పోలిస్తే బ్రాహ్మ‌ణి కాస్త న‌యం. హెరిటేజ్ ఫుడ్స్‌ను న‌డిపిస్తున్న ఆమె అప్పుడ‌ప్పుడూ అయినా కాస్త మీడియాలో మాట్లాడుతుంటుంది.

త‌న తండ్రి 60వ పుట్టిన రోజు నేప‌థ్యంలో ఆమె ఓ మీడియా సంస్థ‌తో ముచ్చ‌టించింది. తండ్రితో ఆస‌క్తిక‌ర అనుభ‌వాల గురించి ఇందులో పంచుకుంది. చిన్న‌పుడు తాను, త‌న తండ్రి క‌లిసి తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ కేబీఆర్ పార్కులు ఎలా వ్యాయామాలు చేసేవాళ్ల‌మో ఆమె వెల్ల‌డించింది. పార్కు ఓపెన్ చేయ‌డానికి ముందే గేటు దూకి వాళ్లిద్ద‌రూ లోప‌లికి వెళ్లేవార‌ట‌.

బాల‌య్య తెల్ల‌వారుజామున మూడున్న‌ర‌కే నిద్ర లేస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యానికే త‌నను కూడా నిద్ర లేపి కేబీఆర్ పార్కుకు తీసుకెళ్లేవాడ‌ని బ్రాహ్మ‌ణి తెలిపింది. అప్ప‌ట్లో తాను చాలా లావుగా ఉండేదాన్న‌ని.. అందుకే వ్యాయామం కోసం తండ్రి త‌న‌ను వెంట‌బెట్టుకుని వెళ్లేవాళ్ల‌ని.. ఐతే తాము వెళ్లే స‌మ‌యానికి పార్కు ఓపెన్ చేసి ఉండేది కాద‌ని బ్రాహ్మ‌ణి వెల్ల‌డించింది.

దీంతో త‌న‌ను గోడ ఎక్కించి లోప‌లికి వ‌దిలిపెట్టి.. త‌ర్వాత బాల‌య్య గోడ దూకేవార‌ని.. ఇద్ద‌రం లోప‌ల క‌స‌ర‌త్తులు చేసుకుని తిరిగి బ‌య‌టికి వ‌చ్చే స‌మ‌యానికి పార్కు గేటు ఓపెన్ చేసేవార‌ని బ్రాహ్మ‌ణి తెలిపింది. త‌న తండ్రి నుంచి పిల్ల‌లంద‌రం అద్భుత‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకున్నామ‌ని బ్రాహ్మ‌ణి చెప్పుకొచ్చింది. ఆయ‌న చిన్న‌పిల్ల‌ల‌తో బాగా క‌లిసిపోతాడ‌ని ఆమె పేర్కొంది.