వరుస యాక్షన్ సినిమాలతో వస్తున్న ప్రభాస్‌ని కాస్త చేంజ్ కోసం లవర్‌బోయ్‌గా చూడాలని ఆశపడ్డారు అభిమానులు. వారి ఆశను నిజం చేయడానికి నాలుగేళ్లు తీసుకున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. నానా అవస్థలూ పడ్డాక ఎట్టకేలకి సంక్రాంతికి రావడానికి రెడీ అయ్యింది రాధేశ్యామ్. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కానీ ఈ సినిమా వర్క్ ఇప్పటికీ ఫినిష్ కాలేదనే విషయం ఫ్యాన్స్‌ని తెగ టెన్షన్ పెడుతోంది.
రీసెంట్గా జరిగిన ప్రెస్మీట్లో ప్రస్తుతం ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ పన్నెండు దేశాల్లో జరుగుతోందని రాధాకృష్ణ చెప్పాడు. దాంతో అభిమానుల గుండెలు గతుక్కుమన్నాయి. ఇంకా ఇరవై రోజులు కూడా లేదు విడుదలకి. ఇప్పటికీ వర్క్ జరుగుతూ ఉండటమేంటా అని వారిలో కంగారు మొదలైంది. దానికి తోడు ఇప్పుడేమో బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం థమన్‌ని తీసుకున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్లో తప్ప మిగతా అన్ని భాషలకీ తనే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు.
నిజానికి ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజైన రాధేశ్యామ్ పాటలు విన్నాక అందరూ ఉసూరుమన్నారు. అనుకున్న స్థాయిలో అలరించడంలో అన్ని పాటలూ విఫలమయ్యాయనే చెప్పాలి. కానీ హిందీలో మాత్రం ప్రతి పాటా హిట్టయ్యింది. దాంతో సౌత్ వెర్షన్స్ మీద బోలెడన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు థమన్ రాకతో పాటలెలా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందనే అంచనాలు ఏర్పడటం ఖాయం.
ముఖ్యంగా ‘అఖండ’కి థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ చూశాక తన మీద ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. అతను వర్క్ చేస్తే రాధేశ్యామ్‌కి కచ్చితంగా ప్లస్సే అవుతుంది. అయితే తనని ఇప్పుడు తీసుకు రావడానికి కారణమేంటి, ఆల్రెడీ చేసింది నచ్చలేదా, అసలు ఇంతవరకు బ్యాగ్రౌండ్ వర్క్ పూర్తి కాలేదా, అసలు అనుకున్న సమయానికి మూవీ రెడీ అవుతుందా లేదా అంటూ భయపడుతున్నారంతా. నిజానికి థమన్ స్పీడ్ మామూలుగా ఉండదు. పాటలే కాదు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా జెట్ స్పీడులో లాగించేస్తాడు. కాబట్టి కరెక్ట్ టైమ్‌కి తన టార్గెట్‌ని ఫినిష్ చేసే చాన్స్ ఉంది.
కాకపోతే వీఎఫ్ఎక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ లాగా ఇంకేమైనా వర్క్స్ పెండింగ్ ఉంటే మాత్రం కష్టం. మొన్న పుష్ప విషయంలో ఈ ఆలస్యమే కొంప ముంచిందనే టాక్ వచ్చింది. ప్రమోషనల్ ఈవెంట్లకు కూడా అటెండ్ అవకుండా చివరి నిమిషం వరకు సినిమాని చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. తగినంత సమయం లేకపోవడంతో మూడు గంటల నిడివితో సినిమాని వదిలాడు. దాంతో కథలో షార్ప్‌నెస్ తగ్గిందని, స్క్రీన్ ప్లేలో ల్యాగ్ ఉందని కామెంట్లు వచ్చాయి. రాధేశ్యామ్ విషయంలో కూడా ఇలాంటిదేదైనా జరగదు కదా అనే ప్రశ్న వెంటాడుతోంది. నాలుగేళ్ల నుంచి తీస్తున్న సినిమాని ఇప్పటికింకా చెక్కుతూనే ఉంటే ఆమాత్రం అనుమానాలు వస్తాయిగా మరి!