సంక్రాంతి రేసులో ఇంకో సినిమా

సంక్రాంతికి ఇటు ఆర్ఆర్ఆర్, అటు రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటికే థియేట‌ర్లు స‌ర్దుబాటు చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతోంది. అందుకే భీమ్లా నాయ‌క్‌ సినిమాను ప‌ట్టుబ‌ట్టి వాయిదా వేయించారు. వీటి మ‌ధ్య బంగార్రాజు చిత్రాన్ని రిలీజ్ చేద్దామ‌ని అక్కినేని నాగార్జున చూస్తున్నాడు కానీ.. దానికి ఏమాత్రం థియేట‌ర్లు దొరుకుతాయ‌న్న‌ది సందేహంగానే ఉంది.

జ‌న‌వ‌రి 7 నుంచి వారం పాటు అందుబాటులో ఉన్న ప్ర‌తి థియేట‌ర్లో ఆర్ఆర్ఆర్‌ను ఆడిద్దామ‌ని చూస్తున్నారు. త‌ర్వాత రాధేశ్యామ్ స‌గానికి పైగా థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించేస్తుంది. ఇక మిగిలే థియేట‌ర్లెన్నో చూడాలి. ఈ స్థితిలో బంగార్రాజుకే థియేట‌ర్లు క‌ష్ట‌మంటే.. ఓ త‌మిళ అనువాద చిత్రం టాలీవుడ్ సంక్రాంతి రేసులోకి వ‌చ్చింది. ఆ చిత్రమే.. బ‌లం. ఈ టైటిల్ చూసి ఇదేం సినిమా అనిపిస్తోందా? ఇది త‌మిళ భారీ చిత్రం వ‌లిమైకి తెలుగు వెర్ష‌న్‌.

కోలీవుడ్ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన అజిత్ హీరోగా ఖాకి ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్ రూపొందించిన చిత్రం వ‌లిమై. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విల‌న్ పాత్ర పోషించ‌డం విశేషం. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి క‌థానాయిక‌. బోనీక‌పూర్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంపై అంచ‌నాలు మామూలుగా లేవు. క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మై.. ఎట్ట‌కేల‌కు 2022 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోందీ చిత్రం. త‌మిళంలో ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. దీనికి పోటీ కూడా లేక‌పోవ‌డంతో భారీగా రిలీజ్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సైతం త‌మిళంలో దీని పోటీని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. అజిత్ సినిమాలు చాలా ఏఏళ్ల నుంచి తెలుగులోకి కూడా అనువాదం అవుతున్నాయి. ఓ మోస్త‌రుగా ప్ర‌భావం చూపుతున్నాయి. వ‌లిమై ప్రోమోలు వావ్ అనిపిస్తుండ‌టం, కార్తికేయ విల‌న్ రోల్ చేయ‌డంతో కొంత‌మేర ఆస‌క్తి ఉంటుంది. కానీ సంక్రాంతికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న హంగామా మ‌ధ్య ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపుతుంద‌న్న‌ది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే. అస‌లు ఈ చిత్రానికి థియేట‌ర్లు ద‌క్క‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌.