ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల వ్యవహారం థియేటర్ వ్యవస్థను దారుణంగా దెబ్బ తీస్తోంది. అసలే కరోనా దెబ్బకు ఆ ఇండస్ట్రీ విలవిలలాడి పోయింది. దేశంలోనే కాక ప్రపంచంలోనే కరోనా మహమ్మారి వల్ల థియేటర్ ఇండస్ట్రీ అంత దెబ్బ తిన్న పరిశ్రమ మరొకటి కనిపించదు. ఆ వ్యవస్థను నమ్ముకున్న కోట్లాది మంది సంక్షోభంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల సంఖ్య బాగా ఎక్కువ. వాటిని నమ్ముకుని వేలాది కుటుంబాలున్నాయి.
యాజమాన్య స్థాయిలో ఉన్న వారు తట్టుకుంటారు కానీ.. వాటిలో వివిధ రకాల పనులు, బాధ్యతలు నిర్వర్తించే వారి పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. కరోనా దెబ్బను తట్టుకుని అతి కష్టం మీద నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న థియేటర్ల వ్యవస్థకు ఇప్పుడు టికెట్ల రేట్ల నియంత్రణ పెద్ద సమస్యగా మారింది. పెద్ద నగరాల వరకు ఓకే కానీ.. తర్వాతి స్థాయలో ఉండే టికెట్ల రేట్లు బాగా తగ్గిపోవడంతో థియేటర్ల మెయింటైనెన్స్ చాలా కష్టంగా మారిపోయింది.
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన, ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్లలో ఒకటిగా పేరొందిన ‘వి ఎపిక్’ థియేటరే జగన్ సర్కారు దెబ్బకు తట్టుకోలేక మూత పడే పరిస్థితికి వచ్చింది. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో రెండేళ్ల కిందట ‘సాహో’ సినిమాతో యువి క్రియేషన్స్ వాళ్లు ఈ మెగా థియేటర్ను ఓపెన్ చేశారు. ఇందులో ఒక తెర ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్లలో ఒకటిగా రికార్డులకెక్కింది. సూళ్లూరు పేట లాంటి చిన్న టౌన్లో ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటవడం ఆ ప్రాంత వాసులకు గర్వకారణమే.
ఇక్కడ సినిమా చూసేందుకు చాలా దూరం నుంచి జనాలు వస్తుంటారు. .పెద్ద సినిమాలు రిలీజైనపుడు సందడి మామూలుగా ఉండదు. ఐతే ఏపీ సర్కారు నిబంధనల ప్రకారం ఇక్కడ రూ.30 రేటుతో టికెట్లు అమ్మాలట. అధునాతన టెక్నాలజీ, సౌకర్యాలతో ఏర్పాటైన థియేటర్లో 30 రూపాయలతో టికెట్లు అమ్మి మనుగడ సాగించడం చాలా చాలా కష్టం. మెయింటైెనెన్స్ కూడా కష్టమైపోతోంది. దీంతో ఇక తమ వల్ల కాదంటూ యువి వాళ్లు ఆ థియేటర్ను మూసేయడం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద షాక్. ఇలాంటి పరిణామాలు చూసి అయినా జగన్ సర్కారు కరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది.