పూరి జగన్నాథ్ దర్శకుడిగా రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. అతను ఏ సినిమాతో దర్శకుడిగా మారాడంటే ‘బద్రి’ అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా. కానీ దాని కంటే ముందు దర్శకుడిగా వేరే సినిమాను మొదలుపెట్టాడు పూరి. కానీ అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత అనుకోకుండా ‘బద్రి’ చేసే అవకాశం దక్కింది. ఐతే పూరి మొదలుపెట్టి ఆపేసిన సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియదు.
దాని గురించి ‘శ్యామ్ సింగ రాయ్’ కథా రచయిత సత్యదేవ్ జంగ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు.
పూరి దర్శకుడిగా ‘థిల్లానా’ అనే సినిమాతో పరిచయం కావాల్సిందని.. ఆ చిత్రానికి హీరో కృష్ణ అని.. కొన్ని కారణాల వల్ల అది మొదలైనట్లే మొదలై మధ్యలో ఆగిపోయిందని చెప్పాడు. పూరీకి దర్శకుడిగా ఈ అవకాశం ఇప్పించింది తానే అని సత్యదేవ్ వెల్లడించాడు.
పూరి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి తనకు బాగా తెలుసని.. అప్పట్లో అతను బాగా నమ్మే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో తాను ఒకడినని సత్యదేవ్ చెప్పాడు. పూరి ప్రతిభను తాను అప్పట్లోనే గుర్తించానని.. ఒక నిర్మాతను పట్టుకుని దర్శకుడిగా తొలి అవకాశం ఇప్పించానని ఆయన వెల్లడించాడు.
అప్పట్లో పూరి దీన్ని చాలా గొప్ప అవకాశంగా భావించాడని.. కానీ కొన్ని కారణాలతో ఈ సినిమా ఆగిపోవడం.. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ చేసే అవకాశం రావడంతో దాన్ని టేకప్ చేశాడని.. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదని అన్నాడు. పూరిని ఇప్పుడు కలిసినా అభిమానంగా పలకరిస్తాడని.. తనతో చాలా బావుంటాడని.. ఐతే తాను అప్పట్లో సాయపడ్డాను కాబట్టి ఇప్పుడు తనకేమైనా చేయాలని తాను పూరీని ఎప్పుడూ అడగలేదని.. ఇకముందు కూడా అడగబోనని.. పూరీకే ఏమైనా అనిపిస్తే తనకు ఏమైనా చేయొచ్చని సత్యదేవ్ వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates