శేఖ‌ర్ క‌మ్ముల సినిమా వెన‌క్కి

చివ‌ర‌గా ల‌వ్ స్టోరి మూవీతో ప‌ల‌క‌రించాడు విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ సినిమా త‌ర్వాత శేఖ‌ర్ ఊహించ‌ని కాంబినేష‌న్లో సినిమాకు రెడీ అయ్యాడు. త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో త్రిభాషా చిత్రం చేయ‌డానికి క‌మ్ముల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ల‌వ్ స్టోరి మూవీని నిర్మించిన ఏషియ‌న్ మూవీస్ సునీలే ఈ సినిమాను కూడా నిర్మించాల్సి ఉంది.

ఈ చిత్రం గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చి చాలా రోజులైంది. ఐతే ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంద‌న్న‌ది క్లారిటీ లేదు. ఈ చిత్రంతోనే ధ‌నుష్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఐతే అది వాస్త‌వం కాదు. ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో స్ప‌ష్ట‌త లేదు. ఈ లోపే ధ‌నుష్ మ‌రో తెలుగు సినిమాను అనౌన్స్ చేశాడు. అది కూడా చాన్నాళ్ల నుంచి చ‌ర్చ‌ల్లో ఉన్న‌దే.

తొలి ప్రేమ‌, మిస్ట‌ర్ మ‌జ్ను, రంగ్ దె చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.. ధ‌నుష్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా రోజుల ముందే వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. దీని గురించి ఇప్పుడు అధికారికంగా ప్ర‌క‌టించారు. రంగ్ దె మూవీని ప్రొడ్యూస్ చేసిన సితార ఎంట‌ర్టైన్మెంట్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మించ‌బోతోంది. ఈ సినిమా గురించి ధ‌నుష్ అనౌన్స్ చేస్తూ ఇది త‌న త‌ర్వాతి త‌మిళ చిత్ర‌మ‌ని, తెలుగులో ఇదే త‌న తొలి సినిమా అని పేర్కొన్నాడు.

దీన్ని బ‌ట్టి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా వెన‌క్కి వెళ్లింద‌ని, ఇదే ధ‌నుష్ తొలి తెలుగు చిత్ర‌మ‌ని స్ప‌ష్టం అయిపోయింది. అప్పుడే టైటిల్ లుక్ రిలీజ్ చేస్తున్నారంటే సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ మీదికి కూడా వెళ్ల‌నుంద‌న్న‌మాట‌. ఈ చిత్రానికి స‌ర్ అనే టైటిల్ ఖ‌రారైన‌ట్లుగా స‌మాచారం. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తార‌ట‌. మ‌రి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా కేవ‌లం వెన‌క్కి వెళ్లిందా.. లేక అదేమైనా ర‌ద్ద‌వుతుందా అన్న చ‌ర్చ కూడా న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం.