తమన్ తండ్రికి రైల్లో హార్ట్ ఎటాక్ వస్తే..

Thaman

సంగీత దర్శకుడు తమన్‌ చూడ్డానికి తమాషాగా.. సరదా మనిషి లాగా అనిపిస్తాడు. అతను ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. అందరినీ నవ్విస్తుంటాడు. ఆడియో వేడుకల్లో, ఇంకెక్కడైనా మాట్లాడుతున్నపుడు కూడా నవ్వుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడూ చీర్ ఫుల్‌గా ఉన్నంతమాత్రాన వాళ్ల జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు, విషాద గాథలు లేవని కాదు.

ఇప్పుడు ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా తన హవా చూపిస్తున్న తమన్ చిన్నతనంలో చాలానే కష్టపడ్డాడు. పది పన్నెండేళ్ల వయసు నుంచే అతను సంగీత దర్శకుల దగ్గర పని చేస్తూ ఆదాయం ఆర్జించి కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడని చాలామందికి తెలియదు. తమన్ తండ్రి శివకుమార్ కూడా సంగీత దర్శకుడే.

తమన్‌‌కు పదేళ్ల వయసున్నపుడే ఆయన చనిపోయారు. ఆ స్థితిలో తాను ఎలా కుటుంబ బాధ్యతలు తీసుకున్నది, తన కోసం కుటుంబం ఎలాంటి త్యాగం చేసింది.. తన తండ్రి ఎలా మరణించింది కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో తమన్ వెల్లడించాడు.

ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజైంది. అందులోనే తమన్ తన చిన్న నాటి కష్టాలను గుర్తు చేసుకోవడం చూపించారు. తమన్ చివరగా తన తండ్రితో ఢిల్లీలో దిగిన ఫొటోను ఈ షోలో ప్రదర్శించారు. ఆ ఫొటో గురించి చెబుతూ.. అది తన చెల్లెలే తీసిందని.. ఢిల్లీలో తన అత్త వాళ్ల ఇంట్లో అది తీశామని.. ఆ ఫొటో తీసుకున్నాక తాము ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరామని.. అప్పుడే కొత్తగా ఆ ట్రైన్ వేశారని.. ఐతే రైల్లోనే తన తండ్రికి తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చిందని తమన్ వెల్లడించాడు.

రైలు స్పీడుగా వెళ్తోందని, ఏం చేయాలో అర్థం కాలేదని.. రైలు ఆగాక స్టేషన్ ఎదురుగానే జనరల్ హాస్పిటల్ కనిపించిందని.. అక్కడికి తీసుకెళ్లి ఉంటే ఆయన బతికేవారని.. కానీ అక్కడికి కాకుండా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ఆయన ప్రాణాలు పోయాయని తమన్ వెల్లడించాడు.

ఐతే తన తండ్రి మరణించినపుడు తానేమీ ఏడవలేదని.. తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనే ఆలోచించానని.. ఆ వయసులో తనకంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో తెలియదని.. అప్పుడు తన తండ్రికి సంబంధించి ఎల్ఐసీ డబ్బులు 60 వేలు వస్తే అది తన తల్లి కుటుంబం కోసం వాడుకోకుండా ఆ డబ్బులు పెట్టి తనకు డ్రమ్స్ కొనిచ్చేసిందని.. వాటితోనే తర్వాత తాను ఆదాయం ఆర్జించడం మొదలుపెట్టానని.. ‘భైరవ ద్వీపం’ సినిమాకు గాను మొదటగా తాను 30 రూపాయల పారితోషకం తీసుకున్నానని తమన్ గుర్తు చేసుకున్నాడు.