హర్షవర్ధన్ మంచి నటుడని అందరికీ తెలుసు. ఐతే అతడి ప్రతిభకు తగ్గ పాత్రలే పడకపోవడంతో నటుడిగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. కానీ అవకాశం వచ్చినపుడల్లా తనేంటో రుజువు చేసుకుంటూనే ఉన్నాడు. ఐతే హర్షలో మంచి రచయిత కూడా ఉన్న సంగతి చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాల్లో అతను తన పెన్ పవర్ చూపించాడు. రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రతి వ్యక్తికీ గమ్యం దర్శకత్వమే.
హర్షకు కూడా ఆ కల ఉంది. అతడికి ఇప్పటికే దర్శకుడిగా ఓ అవకాశం కూడా వచ్చింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఓ సినిమా మొదలుపెట్టాడు. పూర్తి చేశాడు. కృష్ణచైతన్య, శ్రీముఖి, హర్ష ఇందులో కీలక పాత్రలు పోషించాడు. దాని పాటలు, ఇతర ప్రోమోలు ఆసక్తికరంగానే అనిపించాయి. కానీ ఎందుకో ఈ చిత్రం విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ‘గూగ్లీ’ అంటూ పేరు మార్చినా సినిమా రాత మారలేదు.
దర్శకుడిగా తొలి సినిమాకు ఇలా జరిగాక కెరీర్ పుంజుకోవడం కష్టమే. కానీ కొన్నేళ్ల పాటు హర్ష చేసిన ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు అతడికో మంచి అవకాశం దక్కింది. గత కొన్నేళ్లలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించిన సుధీర్ బాబుతో హర్షవర్ధన్ ఓ సినిమా చేయబోతున్నాడు. కొన్ని నెలల ముందే దీని గురించి అప్‌డేట్ వచ్చింది.
ఇప్పుడా సినిమా పట్టాలెక్కింది కూడా. ‘లవ్ స్టోరి’తో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఈ కాంబినేషన్ చూస్తే హర్షకు కచ్చితంగా మంచి అవకాశం దక్కినట్లే. దీన్ని అతనే మాత్రం ఉపయోగించుకుంటున్నాడన్నదే ప్రశ్న. రచయితగా అతను సత్తా చాటుకున్నది క్లాస్ లవ్ స్టోరీలతోనే. ప్రేమకథలను బాగా డీల్ చేయగలడని, వినోదం పండించగలడని రుజువైంది. సుధీర్ కూడా ఈ టైపు సినిమాలకు బాగా సూటవుతాడు. మరి హర్ష అతడితో ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates