మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఇప్పటికీ వంద కోట్లకు పైగా షేర్ రాబట్టే సత్తా ఉంది. అది వరసగా రెండుసార్లు రుజువయింది. అయితే మెగాస్టార్ ఇంకా ఫైట్లు, డాన్సులు చేసే వయసులో లేరు. ఆయనకు ఇప్పుడు అరవై ఐదేళ్లు. ఇంకా కమర్షియల్ మసాలా సినిమాలు చేయడం కంటే అవి అవసరం లేని పాత్రల వైపు దృష్టి సారిస్తే మంచిదని వీరాభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. శారీరికంగా శ్రమ పెట్టే పాత్రలు ఇక కట్టిపెట్టాలని ఫ్యాన్సే మాట్లాడుతున్నారు. ఉదాహరణకు సైరా చిత్రంలో చిరు చాలా చోట్ల డూప్ వాడాల్సి వచ్చింది.
డాన్సులు గట్రా ఇక చరణ్, అల్లు అర్జున్ లకు వదిలేసి అమితాబ్ తరహాలో పెద్ద తరహా పాత్రలపై దృష్టి పెడితే దర్శకులు కథలు కూడా కొత్తగా ఆలోచించే వీలుంటుంది. కానీ చిరు ఇంకా ఆ మోడ్ నుంచి బయటకు వచ్చినట్టు లేరని ఆయన ఎంచుకుంటున్న కథలే చెబుతున్నాయి. అయన అనే కాదు, వెంకటేష్ మినహా అప్పటి అగ్ర హీరోలెవరూ ఇంకా పూర్తిగా తీరు మార్చుకోలేదు. బహుశా అందుకేనేమో పర భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమాలో వెరైటీ చాలా తక్కువగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates