హాలీవుడ్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం కొత్తేమీ కాదు. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా రిలీజైనపుడు ఏ స్థాయి హంగామా నెలకొందరో అందరూ చూశారు. ఇండియాలో రిలీజయ్యే పెద్ద సినిమాలకు దీటుగా ఆ చిత్రానికి అడ్వాన్ బుకింగ్స్ జరిగాయి. కళ్లు చెదిరే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రభావం చూపిస్తున్నది ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ మూవీనే.
ఈ గురువారం రిలీజైన ‘స్పైడర్ మ్యాన్’ కొత్త వెర్షన్ భారతీయ బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 3300 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా.. అన్ని చోట్లా హౌస్ ఫుల్ వసూళ్లతో ఆడేసింది. సినిమాకు మంచి టాక్ కూడా రావడంతో బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. తొలి రోజు ‘స్పైడర్ మ్యాన్’ ఇండియాలో ఏకంగా 36 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఇండియాలో ఈ ఏడాదికి ఇదే హెయెస్ట్ గ్రాసర్ అని ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో.. అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ ప్రత్యేక పాత్రలు పోషించిన ‘సూర్యవంశీ’ సినిమా సైతం ఇండియాలో తొలి రోజు 25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. అలాంటిది ‘స్పైడర్ మ్యాన్’ దాని కన్నా పది కోట్ల పైగానే వసూళ్లు తెచ్చుకుందంటే బాక్సాఫీస్ దగ్గర దీని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్వెల్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలకు లోటు లేకపోవడం.. విజువల్ ఎఫెక్ట్స్ వారెవా అనిపించడంతో సినిమా పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు ఫ్యామిలీస్‌తో కలిసి పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూస్తున్నారు. ఈ వీకెండ్ మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ‘పుష్ప’ వల్ల రెండో రోజు స్క్రీన్ కౌంట్ తగ్గినప్పటికీ దాని పోటీని తట్టుకుని ‘స్పైడర్ మ్యాన్’ ఇండియాలో బ్లాక్‌బస్టర్ స్టేటస్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.