మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఊపు లేరు. వరుసగా సినిమాలు చేసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆచార్య త్వరలోనే విడుదల కానుండగా.. ఇంకో మూడు సినిమాలను ప్రకటించి, సమాంతరంగా ఆ మూడు చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు మెగాస్టార్. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు చిరు కొత్తగా మరో సినిమాను ప్రకటించారు. తనకు వీరాభిమాని అయిన యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి వెల్లడైన సంగతి తెలిసిందే.
ఛలో, భీష్మ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన వెంకీతో చిరు సినిమా చేయబోతుండటం అభిమానులను బాగానే ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఐతే ఆయనకు తోడుగా డాక్టర్ మాధవి రాజు అనే నిర్మాత కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం గమనార్హం.
ఐతే ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనిది, ఎప్పుడూ విననిది. ఇంతకీ ఎవరీ మాధవీ రాజు అని అంతా సోషల్ మీడియాలో వెతకడం మొదలైంది. ఈమె ఎవరో కాదు.. చిరంజీవికి స్వయంగా సోదరి. చిరుకు ఇద్దరు సోదరీమణులున్న సంగతి తెలిసిందే. అందులో ఒకరు విజయదుర్గ. ఆమె సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌ల తల్లి. ఈమె సినిమా ఈవెంట్లలో, అక్కడా ఇక్కడా కాస్త కనిపిస్తుంటారు కాబట్టి జనాలకు ఓ మోస్తరుగా తెలుసు.
కానీ ఇంకో సోదరి మాధవీ రావు మీడియాలో కనిపించడం చాలా తక్కువ. ఆమె వైద్యురాలు. చిరంజీవి నిర్వహించిన వైద్య శిబిరాల్లో, కుటుంబ వేడుకల్లో కొన్నిసార్లు కనిపించారు. మరో సోదరి కొడుకులిద్దరినీ సినిమాల్లోకి తీసుకొచ్చి వాళ్లు నిలదొక్కుకునేలా చేయడంలో చిరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంకో సోదరిని నిర్మాతగా పరిచయం చేసి ఆమెకు తన వంతు చేయాల్సిన సాయం చేస్తున్నారన్నమాట.