జూనియర్ ఎన్టీఆర్ నైపుణ్యాల గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నతనంలోనే బాల రామాయణం సినిమాలోనే నటుడిగా తనేంటో రుజువు చేశాడు. ఇక టీనేజీలోనే స్టార్ స్టేటస్ సంపాదించి ఔరా అనిపించాడు. నటన విషయంలోనే అనర్గళంగా డైలాగ్స్ చెప్పడంలో అతడి ప్రతిభను ఎప్పట్నుంచో అందరూ చూస్తూనే ఉన్నారు. ‘యమదొంగ’లో సుదీర్ఘమైన గ్రాంథిక డైలాగ్‌ను అద్భుతంగా పలికి అందరినీ విస్మయానికి గురిచేశాడు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అతడి ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోతుంటారు.
అతడి వాక్చుతుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి షోలను ఎంత చక్కగా హోస్ట్ చేశాడో తెలిసిందే. తారక్ ఏక సంతాగ్రాహి అని.. దేన్నయినా కాసేపట్లో నేర్చేసుకుంటాడని.. పర్ఫెక్షన్తో డెలివర్ చేస్తాడని అందరూ కొనియాడుతుంటారు. ఇప్పుడు అతడి బహుముఖ ప్రజ్ఞ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి రెండు రోజుల వ్యవధిలో నాలుగు సిటీలు తిరిగాడు తారక్. గురువారం ముంబయిలో, శుక్రవారం బెంగళూరు, చెన్నై, కోచి సిటీల్లో ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు.
ప్రతి చోటా తన వాక్చాతుర్యంతో ఆశ్చర్యపరిచాడు. ముంబయిలో హిందీలో అదరగొట్టిన తారక్.. బెంగళూరులో కన్నడలో, చెన్నైలో తమిళంలో ఏ తడబాటూ లేకుండా చక్కగా మాట్లాడేశాడు. ఆయా భాషల్లో ప్రశ్నలు వేస్తే.. ఏ ఇబ్బందీ లేకుండా ఆ భాషల్లోనే జవాబులు ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌కు ఎన్ని భాషలొచ్చు.. భాష తెలిసినా సరే ఇంత పర్ఫెక్షన్ ఎలా సాధ్యం అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్లో పర్ఫెక్షన్తో హిందీ, కన్నడ, తమిళ భాషల్లో డైలాగులు పలికిన విధానానికి అంతా ఆశ్చర్యపోయారు.
చరణ్ కూడా బాగానే డైలాగులు చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్‌ది వేరే లెవెల్ అనే చెప్పాలి. ఐతే కావాల్సినన్ని టేక్స్ తీసుకుని డబ్బింగ్ చెప్పడం వేరు. ముందు మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తుంటే వారి భాషల్లో తడబాటు లేకుండా జవాబులు చెప్పడం వేరు. ముఖ్యంగా బెంగళూరులో విలేకరులతో కన్నడలో అనర్గళంగా మాట్లాడిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. అంతే కాక పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుంటూ అతడి కోసం తాను పాడిన గెలయా గెలయా పాటను మరోసారి ఆలపించడం, ఇంకెక్కడా ఆ పాట పాడబోనని చెప్పడం అందరినీ కదిలించేసింది