సుక్కు చెక్కుతూనే ఉన్నాడ‌ట‌


సుకుమార్‌కు బ్రిలియంట్ డైరెక్ట‌ర్ అనే కాదు.. పెద్ద క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్ అని కూడా పేరుంది ఇండ‌స్ట్రీలో. ఇందులో నెగెటివ్‌గా చూడ‌టానికేమీ లేదు. స్క్రిప్టు ద‌గ్గ‌ర్నుంచి ఫ‌స్ట్ కాపీ తీసేవ‌ర‌కు సుక్కు దేనికీ ఫిక్స‌యిపోడ‌ని.. ఒక ప‌ట్టాన సంతృప్తి చెంద‌డ‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేర్పులు చేయ‌డం ఆయ‌నకు అల‌వాట‌ని అంటుంటారు. చాలామంది ద‌ర్శ‌కులు రిలీజ్‌కు ఒక‌ట్రెండు వారాల ముందే ఫ‌స్ట్ కాపీ తీసి ప‌క్క‌న పెట్టేస్తారు.

కానీ సుక్కు అలా కాదు.. చివ‌రి వ‌ర‌కు ఎడిటింగ్ టేబుల్ వ‌ద‌ల‌డ‌ని అంటారు. సెన్సార్ చేశాక కూడా చిన్న చిన్న మార్పులు ప్ర‌తి సినిమాకూ జ‌రిగేదే. పుష్ప విష‌యంలోనూ అదే జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఇప్పుడు రేయింబ‌వ‌ళ్లు ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌రే కూర్చుని ఉన్నాడ‌ట‌. ఇంకా మార్పులు చేర్పులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ట‌. సెన్సార్ అయ్యాక ఎడిటింగ్ ఏంటి అనిపించొచ్చు.

సెన్సార్ బోర్డు అభ్యంత‌ర పెట్ట‌ని విధంగా చిన్న చిన్న‌ మార్పులు చేర్పులు చేయ‌డం ఇండ‌స్ట్రీలో మామూలే. సుకుమార్ ప్ర‌తి సినిమాకూ దాదాపు ఇలాగే జ‌రుగుతుంటుంద‌ని అంటారు. మామూలుగా అయితే ఓవ‌ర్సీస్‌కు వారం ముందే కేడీఎంలు డెలివ‌ర్ చేయాల్సి ఉంటుంది. కానీ సుక్కు సినిమాల‌కు మాత్రం ఆల‌స్యం జ‌రుగుతుంటుంది. పుష్ప విడుద‌ల‌కు వారం కూడా స‌మ‌యం లేక‌పోగా.. ఇంకా కేడీఎంలు రెడీ అవ‌లేదు. ఇంకా సుక్కు రేయింబ‌వ‌ళ్లు ఎడిటర్ ప‌క్క‌న కూర్చుని క‌రెక్ష‌న్లు చేస్తూనే ఉన్నాడట‌.

ఆయ‌న ఫైన‌ల్‌గా ఓకే చెప్పాక అవ‌స‌ర‌మైతే కాస్త డ‌బ్బింగ్ కూడా అవ‌స‌ర‌మ‌వుతుంది. చివ‌ర‌గా ఓకే చెప్పిన కాపీకి రీరికార్డింగ్, సౌండ్ డిజైన్ ప‌నులు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఫ‌స్ట్ కాపీ వ‌దులుతారు. ఇంకో మూణ్నాలుగు రోజులు ఈ ప‌నే ఉంటుంద‌ని.. విడుద‌ల‌కు రెండు రోజుల ముందు కానీ పుష్ప‌ ఫ‌స్ట్ కాపీ రెడీ అవ‌ద‌ని.. ఈ విష‌యంలో నిర్మాత‌లు బాగా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని స‌మాచారం.