నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం అఖండ అసాధారణ విజయం దిశగా సాగుతోంది. బాలయ్య చివరి సినిమా రూలర్ పది కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలపడితే.. అఖండ మాత్రం వీకెండ్ అయ్యేసరికే రూ.45 కోట్ల దాకా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ రోజో రేపో ఆ చిత్రం 50 కోట్ల షేర్ మార్కును అందుకోవడం లాంఛనమే. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా దాటేసి బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం కూడా పక్కాగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు ఎంత హైప్ ఉన్నా సరే.. మరీ ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగిస్తుందని.. డివైడ్ టాక్‌ను తట్టుకుని వీకెండ్ అంతా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతుందని ఎవరూ ఊహించలేరు. థియేటర్లలో ఈ సినిమా చూస్తూ బాలయ్య అభిమానులు, మాస్ ప్రేక్షకులు చేసుకున్న సంబరాలు చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ చూసి చాలా కాలమైంది.
అఖండ విజయంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. వేరే క్యాంపు హీరోలు, వాళ్ల అభిమానుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. బాలయ్యకు ఈ స్థాయిలో యూనివర్శల్ అప్లాజ్ రావడం అరుదే. ఇందుక్కారణం ఇండస్ట్రీకి చాలా అవసరమైన ఊపును, ఉత్సాహాన్ని కరోనా తర్వాత 20 నెలల్లో రిలీజైన ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్‌యే. ఆ సినిమాకు ఉన్నంతలో మంచి ఫలితం వచ్చినా.. అది పక్కా మాస్ మూవీ అయితే కాదు. పైగా కరోనా సెకండ్ వేవ్ వల్ల దాని థియేట్రికల్ రన్ అర్ధంతరంగా ఆగిపోయింది.
సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. లవ్ స్టోరీ లాంటి కొన్ని చిత్రాలకు మంచి ఫలితమే వచ్చింది. అయినప్పటికీ థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసే మాస్ సినిమా లేని లోటు మాత్రం కొనసాగింది. అఖండ ఆ లోటును తీర్చింది. బాక్సాఫీస్‌కు ఎక్కడలేని ఉత్సాహం తీసుకొచ్చింది.
తర్వాత రాబోయే పెద్ద సినిమాలన్నింటికీ ఇది ఉపశమనమే. బాలయ్య మోత మొదలెట్టాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఈ ఊపును కొనసాగించాలని.. ఆపై ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిల ఆర్ఆర్ఆర్ ఈ హంగామాను పతాక స్థాయికి తీసుకెళ్లాలని.. సంక్రాంతికి రాబోయే భీమ్లా నాయక్, రాధేశ్యామ్ కూడా ఘనవిజయాలందుకుని పరిశ్రమ పూర్వవైభవం పొందాలని సగటు సినీ ప్రేక్షకుడు ఆశిస్తున్నాడు.