గత కొన్నేళ్ల నుంచి ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నాడు తమన్. ఒకప్పుడు ఊకదంపుడు మ్యూజిక్‌తో విమర్శలెదుర్కొన్న తమన్.. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని.. సరికొత్త సంగీతంతో ఆశ్చర్యపరుస్తున్నాడు. పాటలతో పాటు నేపథ్య సంగీత పరంగానూ అతడి నుంచి బెస్ట్ ఔట్ పుట్ వస్తోంది ప్రతి సినిమాకూ. గత కొన్నేళ్లలో తమన్ ఆడియోలన్నీ సూపర్ హిట్లే. ఐతే నేపథ్య సంగీత పరంగా చాలా స్పెషల్‌గా అనిపించిన సినిమా మాత్రం ‘అరవింద సమేత’నే. ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా ఇంటెన్స్‌గా సాగే ఆ సినిమాకు తమన్ ప్రత్యేకమైన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా ఇప్పటికీ ఆ సినిమా ఆర్ఆర్ గురించి సోషల్ మీడియా మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని మ్యాచ్ చేసే, మించే ఆర్ఆర్ తమన్ నుంచి ఇప్పుడిప్పుడే రాదు అనుకున్నారు. కానీ ‘అఖండ’తో ఆ అభిప్రాయాన్ని మార్చేశాడు తమన్.‘అఖండ’ సినిమాకు సంబంధించి యునానమస్‌గా అందరూ థంబ్సప్ చెబుతున్నది ఆర్ఆర్ విషయంలోనే. తమన్ నేపథ్య సంగీతం తీసేసి చూస్తే ‘అఖండ’ కచ్చితంగా తేలిపోయేదే. సినిమా అంతటా యాక్షన్ ఘట్టాలు.. హీరో ఎలివేషన్లు మినహాయిస్తే పెద్దగా ఏ ప్రత్యేకతలూ లేవు. కానీ ఆ యాక్షన్ ఘట్టాలు, ఎలివేషన్ సీన్లు అభిమానులకు గూస్ బంప్స్ ఇవ్వడంలో తమన్‌ది కీలక పాత్ర.
ప్రతి సన్నివేశాన్నీ తన నేపథ్య సంగీతంతో తమన్ ఎలివేట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరో ఇంట్రో సీన్ నుంచే తమన్ టాప్ గేర్‌లోకి వెళ్లిపోయాడు. చెవుల తుప్పు వదిలిపోయేలా.. ఆడిటోరియాలు దద్దరిల్లేలా ఆర్ఆర్‌తో మోత మోగించేశాడు. ఇక ఇంటర్వెల్ ముంగిట అఖండ పాత్ర రంగప్రవేశంతో తమన్ ఇంకో లెవెల్‌కు వెళ్లిపోయాడు. తెరపై బాలయ్య శివతాండవం చేస్తుంటే తెర వెనుక తమన్ తాండవం చేశాడు. ఆ సౌండ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్.. హమ్మింగ్స్, కోరస్‌లతో దద్దరిల్లిపోతున్నాయి థియేటర్లు. ఇంటర్వెల్ దగ్గర మొదలైన టెంపోను చివరిదాకా కొనసాగించాడు. కథ పరంగా విశేషం ఏం లేకున్నా.. సన్నివేశాలు కూడా మామూలుగా సాగినా కేవలం తమన్ ఆర్ఆర్.. బాలయ్య మాస్ పెర్ఫామెన్స్ వల్ల సినిమా పాసైపోయిందంటే అతిశయోక్తి కాదు.