ఆంధ్రప్రదేశ్ కొన్ని రోజుల నుంచి వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల కిందటే భారీ వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వరదలు ముంచెత్తున్నాయి. దశాబ్దాల వ్యవధిలో ఎన్నడూ జరగనంత నష్టం జరిగింది. జనాలు సర్వస్వం కోల్పోయి కట్టూ బట్టతో నిలిచారు.
ఐతే ఏపీ జనం ఇంతలా అల్లాడిపోతుంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన లేదని.. ఎలాంటి సాయం అందలేదని వైకాపా నేతలు కొన్ని రోజుల కిందట విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి అప్పుడు ఏ స్పందనా లేకపోయింది. ఐతే బుధవారం ఉన్నట్లుండి వరుసబెట్టి టాలీవుడ్ హీరోలు ఏపీ వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించడం మొదలుపెట్టారు.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలతో మొదలుపెడితే.. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్.. ఇలా ఒక్కొక్కరు సరిగ్గా అదే మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ఐతే అందరూ ఒకే మొత్తం విరాళం ప్రకటించడం.. కొంత సమయం వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు సాయం ప్రకటించడం చూస్తే ఇది ముందే అనుకుని ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న వ్యవహారంలా కనిపిస్తోంది.
ఏపీలో టికెట్ల రేట్లను నిర్దేశిస్తూ జీవో రిలీజ్ చేసిన కాసేపటికే హీరోలు ఇలా విరాళాలు ప్రకటించడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఈ విషయంలో ఏదైనా ఒత్తిడి వచ్చి వీళ్లిలా ఒకేసారి అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారా.. లేక టికెట్ల ధరలు ప్రకటించిన నేపథ్యంలో వరద బాధితులకు సాయం ప్రకటించడం ద్వారా జగన్ మనసు మార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా అయితేనేం సినీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్న ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా ఓ కొలిక్కి రావాలని ఇండస్ట్రీ జనాలు కోరుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates