సోషల్ మీడియా జెయింట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు.. 16 ఏళ్లుగా ఆ సంస్థతో కొనసాగుతూ వచ్చిన జాక్.. సోమవారం రాజీనామా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చాలా ఏళ్ల నుంచి ట్విట్టర్‌కు సీఈవోగా ఉన్న జాక్.. తాను ట్విట్టర్‌ను వదిలి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
ఎప్పుడూ ట్విట్టర్లో ఇతర అంశాలు ట్రెండ్ అవుతుంటాయి కానీ.. ఇప్పుడు జాక్ రాజీనామాతో ట్విట్టరే ట్విట్టర్లో ట్రెండ్ అవడం మొదలైంది. ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో ఒకడైన జాక్.. సంస్థ ఛైర్మన్‌గా, వైస్ ఛైర్మన్‌గా వివిధ పదవుల్లో ఉన్నాడు. ఇప్పుడు సీఈవోగా దిగిపోతున్నాడు. జాక్ స్థానంలోకి వస్తున్నది ఒక భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. అతడి పేరు.. పరాగ్ అగర్వాల్. ఈ పేరు చూస్తేనే తను భారతీయుడని అర్థమైపోతుంది.
పరాగ్ ట్విట్టర్ సీఈవోగా నియమితుడైన విషయాన్ని స్వయంగా జాక్‌యే వెల్లడించాడు. వెంటనే పరాగ్ ట్విట్టర్ బయోలో సీఈవో ఆఫ్ ట్విట్టర్ అని వచ్చేసింది కూడా. అతను కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. జాక్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు చాలా వాటికి భారతీయులు, భారత సంతతికి చెందిన వాళ్లే సీఈవోలు, ఛైర్మన్లుగా ఉన్నారు.
గూగుల్ సంస్థకు చెన్నైకి చెందిన సుందర్ పిచ్చాయ్ చాలా ఏళ్లుగా సీఈవోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగువాడైన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను నడిపిస్తున్నాడు. ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ.. అడోబ్ సీఈవో శాంతను నారాయణ్.. పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. ఇలా మరెన్నో ప్రఖ్యాత మల్టీ నేషనల్ కంపెనీలను నడిపిస్తున్నది భారతీయులు, భారత సంతతికి చెందిన వాళ్లే కావడం మన దేశానికి గర్వకారణం.