కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ ఏంటో

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో చాలా వరకు సినిమాలు సొంత బేనర్లో చేసినవే. అందులో అతనొక్కడే, పటాస్ లాంటి చిత్రాలు మాత్రమే అతడికి మంచి ఫలితాలనిచ్చాయి. మిగతావన్నీ తీవ్ర నిరాశకే గురి చేశాయి. ఒక టైంలో కళ్యాణ్ రామ్ తన మార్కెట్, బిజినెస్ స్టామినా గురించి ఏమీ ఆలోచించకుండా ‘ఓం’ అనే భారీ చిత్రాన్ని నెత్తికెత్తుకున్నాడు. తెలుగులో త్రీడీలో తెరకెక్కిన తొలి యాక్షన్ మూవీగా దానికి బాగానే హైప్ వచ్చింది.

అప్పట్లోనే ఏకంగా రూ.25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీస్తే.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. తలకు మించిన భారాన్ని మోయడం కళ్యాణ్ రామ్ వల్ల అస్సలు కాలేదు. ఆ తర్వాత కూడా సొంత బేనర్లో సినిమాలు కొనసాగించాడు కానీ.. మరీ ఇంతేసి బడ్జెట్లలో తన స్థాయికి మించిన సినిమాలు మాత్రం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ నందమూరి హీరో ఇలాంటి రిస్కే చేస్తున్నాడు.

‘ఎంతమంచివాడవురా’ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా ‘బింబిసార’. ఈ రోజే రిలీజైన దీని టీజర్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. టీజర్లో అందరినీ ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం సినిమాలోని గ్రాండియర్. ఇలాంటి సినిమాలు ఏ రాజమౌళి లాంటి వాళ్లో మాత్రమే తీయగలరని నమ్ముతారు ప్రేక్షకులు. హీరోల్లో కూడా పెద్ద స్టార్లయితేనే ఇలాంటివి వర్కవుట్ అవుతాయనే అభిప్రాయం ఉంది.

అలాంటిది ఫాంలో లేని, మార్కెట్ అంతంతమాత్రం అయిన కళ్యాణ్ రామ్ ఇలాంటి భారీ ప్రయత్నాన్ని తలకెత్తుకోవడం.. పైగా ఓ కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయడం షాకింగే. బిజినెస్ పరంగా చూస్తే మాత్రం ఇది చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఐతే టీజర్‌తో ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే తీసుకురాగలిగాడు నందమూరి హీరో. ట్రైలర్‌తో మరింత ఇంప్రెస్ చేసి ప్రేక్షకుల్లో ఇంకా ఇంట్రెస్ట్ తీసుకురాగలిగితే ట్రేడ్ దృష్టిని ఆకర్షించొచ్చు. కానీ కళ్యాణ్ రామ్ మార్కెట్ ప్రకారం చూస్తే మాత్రం సినిమాకు అదిరిపోయే టాక్ వస్తే తప్ప దీని మీద పెట్టిన భారీ బడ్జెట్ రికవరీ అంత తేలిక కాదు.