యూట్యూబ్ థంబ్ నైల్స్‌పై నాని కౌంట‌ర్

థంబ్ నైల్ చూస్తే ఏదో జ‌రిగిపోయిన‌ట్లుంటుంది. తీరా వీడియో ఓపెన్ చేసి చూస్తే తుస్సుమ‌నిపిస్తుంది. ఇదీ కొన్ని యూట్యూబ్ వీడియోల తీరు. వ్యూస్ కోసం వేసే ఈ వేషాలు ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ శ్రుతి మించి పోయాయి. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల మ‌ధ్య విభేదాల గురించి వార్త‌లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. రెండు నెల‌ల పాటు వారి బంధం గురించి ఎంత దారుణ‌మైన థంబ్ నైల్స్ పెట్టారో అంద‌రూ చూశారు.

సినిమా వాళ్ల‌కు సంబంధించి ప్ర‌తి విష‌యం మీదా ఇలాంటి థంబ్ నైల్సే క‌నిపిస్తాయి. వీటి మీద జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షోల్లో కౌంట‌ర్లు ప‌డినా.. సెల‌బ్రెటీలు వార్నింగ్‌లు ఇచ్చినా యూట్యూబర్లు మార‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో నేచుర‌ల్ స్టార్ నాని ఇలా థంబ్ నైల్స్ పెట్టే వాళ్ల మీద త‌న‌దైన శైలిలో కౌంట‌ర్లు వేశాడు. స‌త్య‌దేవ్-నిత్యామీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన స్కైలాబ్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో లీడ్ రోల్ చేయ‌డంతో పాటు నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించిన‌ నిత్య గురించి నాని మాట్లాడ‌బోతూ.. ఒక్క క్ష‌ణం ఆగాడు. త‌న ష‌ర్టు మీద లిప్ స్టిక్ మార్కు ఉంద‌ని, అది ఇందాక నిత్య త‌న‌ను హ‌గ్ చేసుకున్న‌పుడు అంటింద‌ని, యూట్యూబ్ వాళ్లు ఎలా ప‌డితే అలా థంబ్ నైల్స్ వేయొద్ద‌ని నాని అన‌డంతో ఆడిటోరియంలో అంద‌రూ గొల్లుమ‌న్నారు. నాని స‌ర‌దాగానే అన్న‌ప్ప‌టికీ.. యూట్యూబ్ ఛానెళ్ల‌ను న‌డిపే కొంద‌రు ఇలాంటి చీప్ థంబ్ నైల్స్‌తో సినిమాల వాళ్ల‌ను ఇరుకున పెడుతున్నారు.

ఈ సంగ‌తలా ఉంచితే, నిత్య గురించి నాని మాట్లాడుతూ.. ఆమె మ‌ణిర‌త్నం లాంటి ద‌ర్శ‌కుల‌కే ఫేవ‌రెట్ యాక్ట్రెస్ అని, ఆమె గురించి ఏ భాష‌లో ఎవ‌రు మాట్లాడినా గొప్ప‌గా చెబుతార‌ని, సినిమాల ఎంపిక‌లో మంచి అభిరుచి ఉన్న ఆమె.. స్కైల్యాబ్ సినిమాను స్వ‌యంగా నిర్మించి, దాని ప‌ట్ల ప్రౌడ్‌గా ఫీల‌వుతోందంటే అది క‌చ్చితంగా గొప్ప సినిమానే అయ్యుంటుంద‌ని అనుకుంటున్నానని చెప్పాడు.