వెన్నెల, ప్రస్థానం సినిమాలతో తనపై అంచనాలు పెంచిన దర్శకుడు దేవా కట్టా. కానీ ఆ తర్వాత ఆయన ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. వరుస పరాజయాలతో కెరీర్లో చాలా గ్యాప్ వచ్చాక.. బాగా టైం తీసుకుని తయారు చేసుకున్న స్క్రిప్టుతో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ సినిమా తీశాడు. ఐతే ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు. మరీ సీరియస్ సినిమా కావడం.. ట్రాజిక్ క్లైమాక్స్ లాంటి అంశాలు సినిమాకు చేటు చేశాయి.
రిలీజ్ ముంగిట హీరో సాయిధరమ్ తేజ్ అందుబాటులో లేకపోవడం, ప్రమోషన్లు సరిగా చేయకపోవడం కూడా సినిమాకు ప్రతికూలం అయ్యాయి. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఐతే మంచి కాన్సెప్ట్ ఎంచుకుని ఎంతో సిన్సియర్‌గా సినిమా తీసినా సరైన ఫలితం దక్కనందుకు దేవా కట్టా చాలానే బాధ పడ్డాడన్నది సన్నిహితుల సమాచారం.
‘రిపబ్లిక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొట్టుకుపోతున్నపుడు దాన్ని నిలబెట్టడానికి ఒంటరి పోరాటం చేశాడు దేవా. ట్విట్టర్లో ఈ సినిమా గురించి వేసిన పాజిటివ్ ట్వీట్లన్నీ రీట్వీట్ చేస్తూ సినిమాను జనాలకు చేరువ చేయడానికి ప్రయత్నించాడు. థియేట్రికల్ రన్ ముగిశాక ఇప్పుడు కూడా దేవా తన పోరాటం ఆపట్లేదు. ఈ చిత్రాన్ని జీ5 వాళ్లు స్ట్రీమ్ చేయనున్న నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్థాయిలో హడావుడి కనిపిస్తోంది. దీని కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఇక నెటిజన్లు సినిమా చూసి పాజిటివ్ కామెంట్లు పెడుతుంటే.. వాటిని మళ్లీ పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తూ తాను తీసింది చాలా మంచి సినిమా, గొప్ప సినిమా అని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు దేవా. మధ్యలో ఒక నెటిజన్ ‘రిపబ్లిక్-2’ తీస్తానని ప్రామిస్ చేయండి అని అంటే.. సీరియస్ సినిమాలను థియేటర్‌కు వెళ్లి చూస్తానని మీరు ప్రామిస్ చేయండి అంటూ తాను మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్లలో చూసి ఆదరించని ప్రేక్షకులకు పరోక్షంగా కౌంటర్ వేశాడు దేవా.