సినీ ప్రముఖులకు టోకరా.. కోట్లు కొట్టేసిన శిల్పా చౌదరి

ఈ కలికాలంలో ఘరానా మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఓ వైపు సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ మోసాలలో కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు, కొంతమంది కేటుగాళ్లు, కిలేడీలు బడా వ్యాపారవేత్తలమంటూ వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇక, మరికొందరైతే అరచేతిలో వైకుంఠాన్ని చూపించి….సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలను సైతం బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొడుతున్నారు.

తాజాగా హైదరాబాద్ లో ఒక కిలేడీ ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. నగరంలోని బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, ఫైనాన్షియర్లను  శిల్పా చౌదరి అనే మహిళ…టార్గెట్ చేసింది. పేజ్ త్రీ పార్టీలపేరుతో ఎరవేసి వారిని ఆకట్టుకుంది. అధిక వడ్డీ ఇస్తానని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంది.

చివరకు మహిళ పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలను సైతం వదలని శిల్ప…కిట్టీ పార్టీలతో వారిని ఆకర్షించింది. ఇలా దాదాపు రూ.200 కోట్ల వరకు సంపాదించిన శిల్ప గుట్టును ఓ బాధితురాలు రట్టు చేసింది. పుప్పాలగూడ కు చెందిన దివ్యారెడ్డి ఫిర్యాదుతో శిల్పా చౌదరితోపాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

బ్లాక్ మనీని వైట్ చేస్తానని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని దివ్యారెడ్డి నుంచి శిల్ప కోటిన్నర వసూలు చేసింది. అయితే, డబ్బులు చెల్లించిన తర్వాత స్థలం చూపించకపోవడంతో దివ్యకు అనుమానం వచ్చింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దివ్య అడగడంతో…బౌన్సర్లతో శిల్పా చౌదరి బెదిరించింది. చివరకు శిల్ప వ్యవహారంపై దివ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బండారం బయటపడింది.

అయితే, శిల్ప వలలో పడిన వారిలో ఇద్దరు ప్రముఖ నిర్మాతల కుమార్తెలు, ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా శిల్ప అరెస్టు కావడంతో ఆమె చేతిలో మోసపోయిన వారంతా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.