మొత్తానికి సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కారు తగ్గబోదని తేలిపోయింది. టాలీవుడ్ పెద్దలు ఎన్నిసార్లు చర్చలు జరిపినా.. ఎన్ని విజ్ఞప్తులు చేసినా జగన్ ప్రభుత్వం ఏం చేయాలనుకుందో అదే చేస్తోంది. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తప్పదని.. తాము చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు చట్టం కూడా తెచ్చేసింది. ఇక కోర్టుకెళ్లి దీని మీద పోరాడటం తప్ప సినీ జనాలకు వేరే మార్గం కనిపించడం లేదు. ఐతే సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రభుత్వానికి ఇంత పట్టుదల ఏంటన్నదే అర్థం కావం లేదు. టికెట్ల రేట్లు పెంచేసి సామాన్యులను దోచేసుకుంటున్నారని.. వారికి తక్కువ ధరల్లో సినిమా వినోదాన్ని అందించడమే తమ లక్ష్యమని.. జగన్ సర్కారుకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేమీ లేవని.. అందుకే ఎంత బడ్జెట్లో సినిమా తీసినా తమకు సంబంధం లేదని.. అన్నింటికీ ఒకటే రేట్లని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.
ఐతే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ధరలు ఎలా పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి కానీ.. మిగతా రాష్ట్రాలను మించి పన్నులేసి ధరలను విపరీతంగా పెంచేసిన ఘనత జగన్ సర్కారుకే చెందుతుంది. ఏపీతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువ అంటూ పాంప్లెట్లు ముద్రించి కర్ణాటక, తమిళనాడు బార్డర్లలోని పెట్రోల్ బంకులు జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవనే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ ఏపీలో మండిపోతున్నాయి. సినిమా అనేది నిత్యావసరం కాదు. సగటు ప్రేక్షకుడు నెలకు ఒకటో రెండో సినిమాలు చూస్తాడంతే.
ఎప్పుడో ఒకసారి చూసే సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్లు ఆమోద యోగ్యంగానే ఉన్నప్పటికీ వాటిని తగ్గించడానికి ఇంత పట్టుబడుతున్న ప్రభుత్వం.. రోజూ వాడే వస్తువులు, సేవల విషయంలో ఈ పట్టుదల ఎందుకు ప్రదర్శించట్లేదన్న ప్రశ్న అందరి నుంచీ వ్యక్తమవుతోంది. ఆయిల్ ప్యాకెట్ అయినా.. పెట్రోల్ అయినా పెద్ద సిటీలో అయినా ఒకటే రేటు. చిన్న టౌన్లో అయినా అదే రేటు. అలాంటపుడు చిన్న టౌన్లలో మరీ 20-30 రేటు పెట్టి ఏసీ థియేటర్లో సినిమా నడిపిస్తే ఎగ్జిబిటర్ పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్న. మూడు గంటలు ఏసీ థియేటర్లో అధునాతన టెక్నాలజీతో సినిమా చూపిస్తే టికెట్ రేటు కనీసం రూ.100 అమ్మడానికి అవకాశం ఇవ్వరా అని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు.
అసలు సినిమా తీసేది, దాన్ని ప్రదర్శించేది అంతా ప్రైవేటు వ్యక్తులే. తమ ఉత్పత్తికి ఎంత రేటు ఉండాలని నిర్ణయించుకోవడం వారిష్టం. మరీ ఎక్కువ రేటు పెడితే అసలు ప్రేక్షకులే థియేటర్లకు వెళ్లరు. అది వాళ్ల ఛాయిస్. బెనిఫిట్ షోల విషయానికి వస్తే వాటికి అత్యుత్సాహం ఉన్న అభిమానులు వెళ్తారు తప్ప.. సామాన్య ప్రేక్షకులు వెళ్లరు. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఏంటో అర్థం కాని విషయం.
చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదంటున్న ప్రభుత్వ పెద్దలు.. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, లగ్జరీ.. ఇలా మూడు రకాల బస్సులకు మూడు రకాల ధరలు ఎందుకు పెడుతున్నారు.. అన్నింటికీ ఒకటే రేటు పెట్టొచ్చు కదా అన్నది ఒక నెటిజన్ ప్రశ్న. ఇలా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ మొండి వైఖరి పట్ల అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి ఏం సమాధానం చెబుతారో?