ధియేట‌ర్ల మ‌నుగ‌డ కోసం.. ప్ర‌భుత్వం ఆలోచించాలి

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా తీసుకువ‌చ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సినిమాటో గ్ర‌ఫీ యాక్ట్ స‌వ‌ర‌ణ బిల్లుకు సినిమా వ‌ర్గాల నుంచి మౌన నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల విక్ర‌యంపై ప్ర‌భుత్వ అజ‌మాయిషీ ఏర్ప‌డుతుంది. సినిమా ధియేట‌ర్ల‌లో నేరుగా టికెట్ విక్ర‌యాలు ఇక‌పై ఉండ‌వు. అంతేకాదు.. ప్ర‌ముఖ హీరోలు న‌టించే సినిమాల‌పై కూడా ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఉంటుంది. బెనిఫిట్ షోలు స‌హా.. రోజుకు ఆరు ఏడు సినిమాలు వేసుకునే అవ‌కాశం ఇక‌పై ఉండ‌దు. దీంతో సినిమా ఇండ‌స్ట్రీపై ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంద‌రూ అంటున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో దీనిపై ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. సినిమా టికెట్లు విక్ర‌యించ‌డం ద్వారా వ‌చ్చే సొమ్మును అడ్డు పెట్టుకుని రుణాలు పొందాల‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చూస్తోందంటూ.. విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. స‌ర్కారు ముందుకే సాగింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ల‌భించింది. సీఎం జ‌గ‌న్‌కు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బిల్లును తాను మ‌న‌స్పూర్తిగా స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలిపారు.

అయితే.. అదే స‌మ‌యంలో ధియేట‌ర్ల మ‌నుగ‌డ కోసం.. ప్ర‌భుత్వం ఆలోచించాల‌ని చిరు విన్న‌వించారు. ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లుపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూనే.. దేశ‌వ్యాప్తంగా ఒకే విధ‌మైన ప‌న్ను ఉన్న‌ట్టే.. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను కూడా ఒకే విధంగా చేయాల‌ని విన్న‌వించారు. ఇక‌, సినిమా పై ఆధార ప‌డ్డ వారిని కూడా.. ప‌ట్టించుకోవాల‌న్నారు. త‌గ్గించిన టికెట్ ధ‌ర‌ల‌ను కాలానుగుణంగా.. స‌వ‌రించాల‌ని సూచించారు. దీనివ‌ల్ల‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని చిరు పేర్కొన్నారు. ఈ కోణంలో ప్ర‌భుత్వం ఆలోచించాలి.. అని చిరు విజ్ఞ‌ప్తి చేశారు.