సాయిపల్లవి చెల్లెలు వస్తోంది

అక్కలు హీరోయిన్లు అవ్వడం, ఆ వెనకే చెల్లెళ్లు ఇండస్ట్రీకి రావడం ఎప్పటి నుంచో ఉన్నదే. రాధిక చెల్లెలు నిరోషా, నగ్మా చెల్లి జ్యోతిక, కాజల్ సిస్టర్ నిషా.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కాస్త పెద్దదే. ఇప్పుడు మరో చెల్లెలు అక్క బాటలో పయనిస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. తనెవరో కాదు.. సాయిపల్లవి చెల్లెలు పూజ.

కోలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన సాయిపల్లవి ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. కొన్ని ఈవెంట్స్‌లో తనతో పాటు ఆమె చెల్లెలు పూజ కూడా కనిపించింది. తనని చూసి అందరూ అచ్చం సాయిపల్లవిలానే ఉందే అంటూ ఆశ్చర్యపోయారు. పూజ కూడా సినిమాల్లోకి వస్తోందంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అవి ఇప్పటికి నిజమయ్యాయి. పూజ హీరోయిన్‌గా మొదటి సినిమా రెడీ అయ్యింది.

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌‌ సిల్వా మెగాఫోన్ పట్టి ‘చితిరై సెవ్వానం’ అనే చిత్రాన్ని తీశాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథలో తండ్రిగా సముద్రఖని నటించారు. కూతురిగా పూజ కనిపించబోతోంది. అమృత స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్‌‌ 3 నుంచి జీ5లో స్ట్రీమ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌ను కనుక సడెన్‌గా చూస్తే అందులో ఉన్నది సాయిపల్లవేనేమో అనిపించడం ఖాయం.

సాయిపల్లవి హీరోయిన్‌ అయినప్పుడు ఆమె అసలు హీరోయిన్ మెటీరియలే కాదన్నారు కొందరు. మరీ సింపుల్‌గా ఉంటుంది. మేకప్ వేసుకోదు. కొత్త కొత్త స్టైల్స్ ట్రై చేయదు. గ్లామర్‌‌కీ దూరం. ఇలా అయితే ఎలా అన్నారు. కానీ ఆమె నటనకు ఫిదా అయిపోయి ఇప్పుడు హారతి పడుతున్నారు. ఆమెని దృష్టిలో పెట్టుకుని పాత్రలు డిజైన్ చేస్తున్న దర్శకులూ ఉన్నారు. పూజ చూడటానికైతే అక్కలానే ఉంటుంది. మరి ఆమెలానే బెస్ట్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.