విరాటపర్వం.. ప్లాన్ మారిపోయింది

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సినిమాల పరిస్థితి డోలాయమానంలో పడింది. కొన్ని సినిమాలు మొదలే కాకుండా ఆగిపోయాయి. కొన్ని సినిమాలు మొదలై.. మధ్యలో నిలిచిపోయాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని కూడా విడుదల కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నేమో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ బాట పట్టాయి. ఇక సినిమా ఏ దశలో ఉందో తెలియకుండా.. ఎప్పుడు, ఎలా రిలీజవుతుందో తెలియకుండా సందిగ్ధతలో పడ్డ చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి.. విరాట పర్వం.

రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల రూపొందించిన క్రేజీ ఫిలిం ఇది. సురేష్ ప్రొడక్షన్స్‌, మరో నిర్మాణ సంస్థ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి. గత ఏడాది వేసవిలోనే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగానే వాయిదాల మీద వాయిదాలు పడింది.

కరోనా సెకండ్ వేవ్‌కు ముందున్న సమాచారం ప్రకారం రెండు వారాల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. సెకండ్ వేవ్ అయిపోయింది. షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాయి. తర్వాత థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. ఓటీటీల్లో వచ్చే సినిమాలు ఓటీటీల్లో వచ్చాయి. మిగతా సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. కానీ ‘విరాటపర్వం’ సంగతే ఎటూ తేలలేదు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వాళ్లకు అమ్మేశారని.. నేరుగా ఓటీటీలో రిలీజవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ నెలలు గడుస్తున్నా రిలీజ్ గురించి చప్పుడే లేదు.

ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘విరాటపర్వం’కు సంబంధించి ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేశారట. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నారట. ఈ మేరకు మీడియాకు లీక్స్ కూడా అందాయి. ఇంకొన్ని రోజుల్లోనే థియేట్రికల్ రిలీజ్ గురించి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌ అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశలో ఉందని.. వీలును బట్టి జనవరి నెలాఖర్లో లేదా ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు.