ఇటు తగ్గేదే లే.. అటు విడిచేదే లే

ఒక సినిమా స్ఫూర్తితో అలాంటి మరో సినిమా తీయొచ్చు. ఒకే సబ్జెక్ట్‌తో ఒకే సమయంలో రెండు సినిమాలూ రావొచ్చు. స్టోరీ దగ్గర్నుంచి స్క్రీన్‌ ప్లే, టేకింగ్, డైలాగ్స్, ఆర్టిస్టుల గెటప్స్ కూడా ఒకేలా ఎలా ఉంటాయి? ఇది అర్థం కాకే ‘అడవి దొంగ’ ట్రైలర్ చూసినవాళ్లు అవాక్కవుతున్నారు. అంత ఆశ్చర్యం దేనికి అంటే.. ఈ ట్రైలర్‌‌ని చూడగానే చప్పున ‘పుష్ప’ గుర్తొచ్చేస్తోంది మరి.

రామ్‌ తేజ్, రేఖ ఇందుకూరి, వడ్డి మహేష్ ప్రధాన పాత్రల్లో కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో ‘అడవిదొంగ’ అనే సినిమా తెరకెక్కుతోంది. గోపీకృష్ణ నిర్మాత. ఈ మూవీ ట్రైలర్‌‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అది చూసినవారంతా షాకైపోయారు. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్.. హీరో స్మగ్లర్.. విలన్ పోలీసాఫీసర్. ఇదొక్కటే కాదు.. లొకేషన్స్ సేమ్. హీరో గెటప్ చూస్తే బన్నీని ఇమిటేట్ చేయాలనే చూసినట్టు అనిపిస్తోంది. పైగా బన్నీ తగ్గేదేలే అంటే ఈ హీరో విడిచేదే లే అంటున్నాడు.

హీరోయిన్‌ కూడా రష్మిక లాగే డీగ్లామరస్. హీరోని స్టేషన్‌లో న్యూడ్‌గా హెరాస్ చేసే కొన్ని సీన్లు తప్ప.. మిగతాదంతా ఏ రకంగా చూసినా పుష్పని మక్కీకి మక్కీ దించేశారా అనిపించడం ఖాయం.

అయితే ఈ వీడియోని యూట్యూబ్‌లో చూసినవారు చాలా తక్కువ. బహుశా అందుకే చర్చలు, రచ్చలు మొదలు కాలేదేమో. కానీ బన్నీ ఫ్యాన్స్ కానీ చూస్తే రియాక్షన్ ఎలా ఉంటుందా అన్నదే ప్రశ్న. అసలు దీన్ని కాపీ అనాలా, ఇంకేమైనా అనాలా అనేది అర్థం కాని పరిస్థితి. ఎంత సేమ్ థాట్ వచ్చినా టేకింగ్‌లో కూడా ఇన్ని పోలికలు ఎలా వస్తాయసలు! సుకుమార్ టేకింగ్‌ని, అల్లు అర్జున్‌ పర్‌‌ఫార్మెన్స్‌ని రీచ్ కావడం యేళ్ల తరబడి ఎక్స్‌పీరియెన్స్ సాధించినవారి వల్లే కాదు కాబట్టి ఈ అరాచకాన్ని లైట్ తీసుకోవడం మంచిదా! అసలు సుకుమార్, బన్నీలు దీన్ని ఇంకా చూశారో లేదో.. చూస్తే ఏమంటారో!