మూడు నెల‌ల్లో ఎంత మార్పో!

మూడు నెలల కింద‌ట హిందీలో బెల్‌బాట‌మ్ అనే సినిమా ఒక‌టి రిలీజైంది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డైన అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్ర‌మ‌ది. ఫ్లైట్ హైజాక్ నేప‌థ్యంలో ఉత్కంఠ రేపే క‌థ‌తో ఈ సినిమాను చ‌క్క‌గా తీర్చిదిద్దారు. సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. అయినా స‌రే.. ఈ సినిమా థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి. క‌రోనా సెకండ్ వేవ్ అప్పుడ‌ప్పుడే త‌గ్గుముఖం ప‌డుతున్న టైంలో హడావుడిగా సినిమాను రిలీజ్ చేసేశారు. ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఇంకా థియేట‌ర్ల‌లో సినిమాలు చూడ్డానికి అప్ప‌టికి అల‌వాటు ప‌డ‌లేదు.

నార్త్ మార్కెట్లో థియేట‌ర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ముఖ్యంగా హిందీ సినిమాల‌కు కేంద్ర స్థానం అన‌ద‌గ్గ మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు తెరుచుకోక‌పోవ‌డం బెల్ బాట‌మ్‌కు గ‌ట్టి దెబ్బే అయింది. ఇండియ‌న్ మార్కెట్లో ఈ సినిమా 30 కోట్ల లోపే గ్రాస్ క‌లెక్ట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ అటు ఇటుగా 50 కోట్ల వ‌సూళ్లొచ్చాయి అంతే.

బెల్ బాట‌మ్ లాంటి క్రేజీ మూవీకి ఇలాంటి వ‌సూళ్లు వ‌చ్చేస‌రికి బాలీవుడ్ జ‌నాలు బెంబేలెత్తిపోయారు. క‌రోనా దెబ్బ నుంచి ఇంకెప్ప‌టికి కోలుకుంటామో అన్న ఆందోళ‌న వారిని షేక్ చేసింది. ఐతే ఇప్పుడు అక్ష‌య్ కుమారే హీరోగా న‌టించిన మ‌రో సినిమా సూర్య‌వంశీ వారి భ‌యాల‌న్నింటినీ పోగొట్టేసింది. మ‌హారాష్ట్ర స‌హా దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాక‌.. దీపావ‌ళి లాంటి మంచి సీజ‌న్ చూసి, సినిమాను బాగా ప్ర‌మోట్ చేసి థియేట‌ర్ల‌లోకి దించారు. ఈ సినిమా తొలి రోజు నుంచి వ‌సూళ్ల మోత మోగిస్తూ వ‌చ్చింది.

డొమెస్టిక్ మార్కెట్లో ఈ సినిమా రూ.150 కోట్ల మార్కును దాటేయ‌డం విశేషం. ఓవ‌ర్సీస్‌లో వ‌సూళ్లు రూ.50 కోట్ల మార్కును ట‌చ్ చేశాయి. మొత్తంగా రూ.200 కోట్ల గ్రాస్‌తో ఔరా అనిపించింది సూర్య‌వంశీ. ఇంకో రూ.50 కోట్ల వ‌సూళ్లు వ‌స్తాయ‌ని అంచ‌నా. అంటే బెల్ బాట‌మ్ కంటే ఐదు రెట్లు ఎక్కువ వ‌సూళ్ల‌న్న‌మాట‌. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇంత మార్పా అని ట్రేడ్ పండితులు ఆశ్చ‌ర్య‌పోతున్నారిప్పుడు.