మూడు సినిమాలు.. మురిపిస్తాయా?


గ‌త వారం దీపావ‌ళి కానుక‌గా వ‌చ్చిన సినిమాలేవీ కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అంత‌గా మెప్పించ‌లేదు. రజినీకాంత్ సినిమా పెద్ద‌న్న మ‌రీ దారుణ‌మైన టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ప‌ట్ల మ‌న ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. మ‌రో త‌మిళ అనువాద చిత్రం ఎనిమీకి టాక్ బాగున్నా.. ప్రి రిలీజ్ బ‌జ్ లేక‌పోవ‌డం వ‌ల్ల దానికి కూడా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. మారుతి సినిమా మంచి రోజులు వ‌చ్చాయికి రిలీజ్ ముంగిట హైప్ బాగానే ఉన్నా.. బ్యాడ్ టాక్ దెబ్బ కొట్టింది. మొత్తంగా గ‌త వారం సినిమాల‌న్నీ నిరాశ‌కే గురి చేశాయి.

ఐతే ఈ వారం రిలీజ‌వుతున్న మూడు సినిమాలూ ప్రేక్ష‌కుల్లో ఆశ‌లు రేకెత్తిస్తున్నాయి. ఈ మూడూ విభిన్న‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన‌వి. ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌వి.

యువ క‌థానాయ‌కుడు కార్తికేయ ప్ర‌ధాన పాత్ర పోషించిన రాజా విక్ర‌మార్క మంచి ఎంట‌ర్టైన్మెంట్ ఉన్న యాక్ష‌న్ మూవీలా క‌నిపిస్తోంది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ స‌రిప‌ల్లి ప్ర‌తిభ టీజ‌ర్, ట్రైల‌ర్ల‌లో క‌నిపించింది. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న కార్తికేయ‌కు ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చేలాగే క‌నిపిస్తోంది.

మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.. ఇప్ప‌టికే మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో ఆక‌ట్టుకున్నాడు. దాని స్ట‌యిల్లోనే మ‌రో విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కిన పుష్ప‌క విమానంతో ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. పెళ్లయిన కొన్ని రోజుల‌కే పెళ్లాం లేచిపోతే ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో న‌డిచే ఫ‌న్నీ మూవీ ఇది. దీని ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకుంది.

ఇక మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ చేసిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా కురుప్ కూడా ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షిస్తోంది. దీని ట్రైల‌ర్ వావ్ అనిపించింది. ఒక క‌ల్ట్ మూవీ అయ్యేలా క‌నిపిస్తోంది కురుప్. కాక‌పోతే తెలుగులో ఈ సినిమాకు కొంచెం క్రేజ్ త‌క్కువ‌గానే ఉంది. మొత్తానికి ప్రామిసింగ్‌గా క‌నిపిస్తున్న ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌లో సంద‌డి తెస్తాయేమో చూడాలి.