క‌న్న‌డ ద‌ర్శ‌కుడిపై మ‌నవాళ్ళ ‘అతి’ ప్రేమ‌

రాజ‌మౌళి నుంచి త్రివిక్ర‌మ్ వ‌ర‌కూ
కొర‌టాల నుంచి బోయ‌పాటి శ్రీ‌ను వ‌ర‌కూ…

స్టార్ ద‌ర్శ‌కుల‌కు ఏనాడూ మ‌న ఇండ్ర‌స్ట్రీలో కొద‌వ లేదు. వాళ్లు సినిమాల్ని శాశించారు, శాశిస్తున్నారు. వీళ్ల‌కంటే ఉద్దండులైన ద‌ర్శ‌కుల్ని చూశారు నిర్మాత‌లు. వాళ్లతో సినిమాలు చేయ‌డానికి క్యూలు క‌ట్టారు. హిట్టిచ్చిన డైరెక్ట‌ర్ల వెంట ప‌రుగులు తీశారు.

అయితే… ఎప్పుడూ ఏ ద‌ర్శ‌కుడి పుట్టిన రోజుకీ.. ఎప్పుడూ, ఎక్కడా, ఏ పేప‌ర్ల‌లోనూ ఫుల్ పేజీ యాడ్లు మాత్రం ఇవ్వ‌లేదు. అంత అవ‌స‌రం లేద‌నుకున్నారో, అంత ఖ‌ర్చు ఎందుకు అనుకున్నారో తెలీదు గానీ.. వాటి జోలికి వెళ్ల‌లేదు.

నిజానికి ద‌ర్శ‌కుడి పుట్టిన రోజున నిర్మాత‌లు యాడ్లు ఇవ్వాలా? అని అనుకోవొచ్చు. ఆ అవ‌స‌రం లేదు. సినిమా రంగంలో ఏ వ్య‌వ‌హార‌మైనా స‌రే, ప్ర‌చారంతో ముడిప‌డి సాగుతుంటుంది. యాడ్లు కూడా అందులో భాగ‌మే. అయినా స‌రే లైట్ తీసుకున్నారు.

ఇప్పుడు మాత్రం తెలుగు నిర్మాత‌లు ఓ క‌న్న‌డ ద‌ర్శ‌కుడి పుట్టిన రోజుకి పోటీ ప‌డి యాడ్లు ఇచ్చారు. అది కూడా క‌న్న‌డ ప్ర‌భ లాంటి పెద్ద ప‌త్రిక‌ల్లో. గురువారం కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. కేజీఎఫ్ లాంటి సూప‌ర్ హిట్ తీసిన ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శాంత్ పుట్టిన రోజు హ‌డావుడి క‌నిపించింది.
దాన‌య్య‌, మైత్రీ మూవీస్ నిర్మాత‌లు ప్ర‌శాంత్ నీల్‌కి శుభాకాంక్ష‌లు చెబుతూ ఫుల్ పేజీ యాడ్లు గుమ్మ‌రించారు. స‌ద‌రు యాడ్లు చూసి క‌న్న‌డ నిర్మాత‌లు కూడా ఖంగుతున్నారు. ఇన్ని డ‌బ్బులు పోసి, యాడ్లు ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా? అంటూ ఈ విష‌య‌మై క‌న్న‌డ నిర్మాత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

ఇదంతా ఆ ద‌ర్శ‌కుడి మెహ‌ర్బానీ కోసం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మైత్రీ మూవీస్ సంస్థ ఆల్రెడీ ప్ర‌శాంత్‌కి అడ్వాన్స్ ఇచ్చింది. దాన‌య్య కూడా ప్ర‌శాంత్ తో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆయ‌న చేజారిపోకుండా ఉండాల‌న్న త‌ప‌న‌తోనే ఈ ప్ర‌క‌ట‌న‌ల ప‌రంప‌ర కొన‌సాగింది.

పోనీ ప‌రాయి భాషా ద‌ర్శ‌కులు తెలుగులో అద్భుతాలు సృష్టించారా అంటే అదీ లేదు. గ‌జినిలాంటి అద్భుతాలు తీసిన మురుగ‌దాస్ తెలుగులో ఏమ‌య్యాడు? గౌత‌మ్ మీన‌న్ మ్యాజిక్ తెలుగులో ఎందుకు ప‌ని చేయ‌లేదు? లింగు స్వామి కి క‌థ ఏమైంది? విష్ణు వ‌ర్థ‌న్ తెలుగులో ఎందుకు రాణించ‌లేక‌పోయాడు? త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ డ‌మ్ అనుభ‌వించిన ఏ ద‌ర్శ‌కుడూ తెలుగులో హిట్ ఇవ్వ‌లేదు.