తెరపై సూర్య హీరో.. రియల్ హీరో ఆయన

జై భీమ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న సినిమా. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో జ్ఞానవేల్ రూపొందించిన చిత్రమిది. ‘జై భీమ్’ను స్వయంగా సూర్యనే తన ‘2డీ ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నిర్మించడం విశేషం. తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక లాకప్ డెత్ ఆధారంగా కథను అల్లుకుని ఎంతో పకడ్బందీగా, హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించిన ప్రశంసలు అందుకుంటున్నాడు జ్ఞానవేల్.

ఇలాంటి సినిమాకు నిర్మాతగా అండగా నిలవడమే కాక.. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన సూర్య మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే తెరమీద సూర్య హీరో అయితే.. రియల్ హీరో మాత్రం ఇంకొకరున్నారు. ఆయనే చంద్రు. సూర్య పోషించింది ఈయన పాత్రే కావడం విశేషం. ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్‌ గురించి తెలుసుకుని కదిలిపోయి అతడికి, తన కుటుంబానికి న్యాయం చేయడానికి అలుపెరగని పోరాటం చేసిన వైనాన్నే సినిమాలో చూపించారు.

ఐతే చంద్రు గొప్పదనం ఈ ఒక్క కేసుకు పరిమితం కాదు. ఆయన తన న్యాయవాద వృత్తిలో ఉండగా వాదించిన ఏ మానవ హక్కుల కేసుకూ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ల కోసం ఎన్నో కేసులు ఆయన వాదించి వారికి న్యాయం చేశారు. ఎంతోమందికి నష్ట పరిహారాలు అందేలా చూశారు. తర్వాత చంద్రు జడ్జి కూడా కావడం విశేషం. అప్పుడు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. కోర్టులో జడ్జినుద్దేశించి ‘మై లార్డ్’ అని సంబోధించడాన్ని తన వరకు నివారించారు.

జడ్జిగా ఆరేళ్ల వ్యవధిలో 96 వేలకు పైగా కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. మహిళలు దేవాలయాల్లో పూజారులుగా వ్యవహరించవచ్చని, కులం ఏదైనా అందరికీ ఒకే శ్మశానం ఉండాలని, దళితులకు శ్మశానంలో వేరే స్థలం కేటాయించడం నిషిద్ధమని.. ఇలా విప్లవాత్మక తీర్పులెన్నో ఇచ్చారు చంద్రు. పదవీ విరమణకు ముందు, తర్వాత తన ఆస్తులను ప్రకటించడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఆయన వాదించిన ఒక సంచలన కేసు ఆధారంగా ‘జై భీమ్’ సినిమా తీసి చంద్రు గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారు సూర్య, జ్ఞానవేల్.