ఈ మంగళవారం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై అద్భుత స్పందన తెచ్చుకుంటోంది సూర్య సినిమా ‘జై భీమ్’. 90వ దశకంలో తమిళనాడులో జరిగిన ఒక యదార్థ ఉదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తప్పుడు కేసు పెట్టి పోలీసులు చూపించిన కర్కశత్వానికి లాకప్‌లో చనిపోయిన ఓ గిరిజినుడికి, అతడి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఒక లాయర్ చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ఒక గొప్ప కథను.. పకడ్బందీ కథనంతో, ఎంతో హృద్యంగా తీర్చిదిద్దిన వైనానికి ప్రేక్షకులు కదిలిపోతున్నారు. రిలీజ్ ముంగిట ఈ సినిమాపై అంచనాలు తక్కువే కానీ.. చూసిన వాళ్లందరూ ఇదొక అద్భుతమైన సినిమా అంటుండటంతో ఆదరణ పెరుగుతోంది. వివిధ భాషల వాళ్లు సినిమా చూస్తున్నారు. ఐతే సినిమాలో అంతా బాగానే ఉంది కానీ.. ఓ సన్నివేశం మాత్రం ఉత్తరాది ప్రేక్షకులకు రుచించడం లేదు.
సినిమాలో ఒకచోట ప్రకాష్ రాజ్ పాత్ర.. ఓ మార్వాడీ సేట్ నుంచి ఏవో వివరాలు అడుగుతాడు. అప్పుడతను హిందీలో ఏదో చెప్పబోతాడు. వెంటనే ప్రకాష్ రాజ్ కోపంగా అతడిని చెంపమీద లాగి కొట్టి తమిళంలో మాట్లాడమంటాడు. ఈ సీనే ఇప్పుడు నార్త్ ఆడియన్స్‌కు రుచించట్లేదు. హిందీ వాళ్లను చులకన చేసేలా.. ఆ భాష మీద ద్వేషం పెంచేలా ఈ సీన్ ఉందని.. గత కొన్నేళ్లలో తమిళం సహా దక్షిణాది భాషా చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్న తమను దృష్టిలో ఉంచుకోకుండా ఇలాంటి సన్నివేశం ఎలా తీస్తారని.. సినిమా నుంచి ఈ సన్నివేశాన్ని తొలగించాలని హిందీ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.
హిందీ పట్ల తమిళుల వ్యతిరేకతకు సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. జాతీయ భాష పేరుతో హిందీని బలవంతంగా తమపై రుద్దుతున్నారంటూ దశాబ్దాల కిందటే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. ఇప్పటికీ తమిళులకు హిందీ అంటే పడదు. ఇప్పుడు ‘జై భీమ్’లో ఇలాంటి సీన్ పెట్టడం కూడా హిందీ పట్ల వ్యతిరేకతకు నిదర్శనంగానే భావిస్తున్నారు. ఐతే సినిమా కంటెక్స్ట్‌లో చూస్తే ఆ సన్నివేశంలో తప్పు లేదని, హిందీలో మాట్లాడి తనను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్న వ్యక్తిని పోలీస్ అధికారి కొట్టి తమిళంలో మాట్లాడిస్తాడని, అందులో తప్పేముందని కొందరు వాదిస్తున్నారు.