అదే కథతో మాస్ రాజా.. బెల్లంకొండకు బ్యాండేనా?

మాస్ రాజా మాంచి స్పీడు మీదున్నాడు కొంత కాలంగా. వరుసబెట్టి అతను సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ 71వ సినిమాను అనౌన్స్ చేశారు. ఇది హీరోగా మాస్ రాజాకు 50వ చిత్రం కావడం విశేషం. ముందు అన్నట్లే ఇది పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఉన్న సినిమానే రవితేజ తొలి పాన్ ఇండియా మూవీ కానుంది. ఇంతకుముందు దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి క్రైమ్ కామెడీ చిత్రాలను రూపొందించిన వంశీ ఆకెళ్ల ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తోనే తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ నిర్మించనుంది. 70, 80 దశకాల్లో ఆంధ్రా ప్రాంతంలో భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ జనాలకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అనేసరికి అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఐతే ఈ కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రాబోతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి ‘స్టూవర్టుపురం దొంగ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కేఎస్ అనే దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నాడు. చాలా ఏళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న బెల్లంకొండ సురేష్ ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొడుకు హీరోగా పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమాను ఆయన నిర్మించనున్నాడు.

ఐతే ప్రస్తుతం శ్రీనివాస్ ‘చత్రపతి’ హిందీ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. రవితేజ కూడా ఆ టైంలోనే టైగర్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. ఐతే మాస్ రాజా క్రేజ్ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ నిలవడం కష్టమే. రవితేజ చేస్తున్న సినిమాకు మాంచి టీం కూడా కూదిరింది. జీవీ ప్రకాష్ కుమార్, మధి లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. క్రైమ్ మూవీస్ తీయడంలో వంశీకి మంచి పట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే కథతో సినిమా చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.