కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి అప్పుడే మూడు రోజులు దాటిపోయింది. అతను చనిపోయింది శుక్రవారం అయినా.. అశేషమైన అభిమానులకు కడసారి చూపు చూసుకునే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రెండు రోజుల పాటు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అతడి పార్థివ దేహాన్ని ఉంచారు. లక్షల మంది పునీత్‌ను చివరి చూపు చూసుకున్నాక ఆదివారం అతడి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఐతే పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు గుండెపోటుకు గురి కావడం.. ఆత్మహత్యలకు పాల్పడటం లాంటివి జరుగుతుండటం బాధాకరం. ఈ నేపథ్యంలోనే తమ్ముడి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ.. శివరాజ్ కుమార్ అభిమానులనుద్దేశించి మాట్లాడాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోవడం తన వల్ల కూడా కావట్లేదని.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, నమ్మలేకపోతున్నానని అన్న శివరాజ్ కుమార్.. వాస్తవాన్ని అంగీకరించి జీవితంలో ముందుకు వెళ్లడం అవసరమని అన్నాడు.
అభిమానులకు కుటుంబాలున్నాయని, వాళ్లను నమ్ముకుని ఎంతోమంది ఉంటారని.. కాబట్టి ఈ సమయంలో నిబ్బరంతో ఉండాలని శివరాజ్ సూచించాడు. పునీత్ తనకంటే 13 ఏళ్లు చిన్నవాడని.. అతను తన చేతుల్లో పెరిగాడని.. అందుకే తననెప్పుడూ తమ్ముడిలా చూడలేదని, కొడుకులాగే చూసేవాడినని.. ఇప్పుడు అతడి మరణం తీవ్ర వేదన కలిగిస్తోందని.. తమ కుటుంబానికి ఇది తీరని లోటని శివరాజ్ వ్యాఖ్యానించాడు.
తమ్ముడి మరణంతో శివరాజ్ ఎంత వేదనకు గురయ్యాడో చెప్పడానికి పునీత్ పార్థివ దేహం పక్కన చిన్నపిల్లాడిలా కూర్చుని ఏడ్చిన వీడియోలు నిదర్శనం. అంత బాధలోనూ అభిమానుల పట్ల బాధ్యతతో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అభినందనీయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates