జక్కన్నా.. వాళ్లను వదలవా?

బ్రింగింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి లేటెస్టుగా రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్‌లో కనిపించిన మాట ఇది. దీనికి అర్థమేంటా అని ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఇండియన్ సినిమాకు పూర్వ వైభవం తీసుకురాబోతున్నట్లుగా జక్కన్న సంకేతాలు ఇచ్చినట్లున్నాడు ఈ మాట ద్వారా.

ఐతే పూర్వ వైభవం అంటే ఎప్పటిది.. ఎవరు తీసుకొచ్చింది.. మధ్యలో ఆ వైభవానికి ఏమైంది? ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోనే ఆ వైభవం వచ్చేస్తుందా.. అన్నది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. ఇది రాజమౌళి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వాడిన మాటలా తోస్తోంది కొందరికి. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకు ఇది అంతగా రుచించే అవకాశం లేదు. ఇప్పటికే ‘బాహుబలి’ దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఆ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు అక్కడి ఫిలిం మేకర్లు.

ఇండియన్ సినిమాలో తమదే ఆధిపత్యం అని.. ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అన్న అభిప్రాయంతో ఉన్న వాళ్లను ఒక ఆత్మన్యూనతా భావంలోకి నెట్టిన చిత్రమిది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్రోమోలు చూసి మరింతగా వాళ్లు కంగారెత్తిపోతున్నారు. జక్కన్న మరోసారి ‘బాహుబలి’ తరహాలో ఉత్తర భారత బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం.. అక్కడి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించి థియేటర్లను షేక్ చేయడం.. అలాగే బాలీవుడ్‌ను బెంబేలెత్తించడం పక్కాగా కనిపిస్తోంది.

అందులోనూ ఇండియన్ సినిమాకు పూర్వ వైభవం తీసుకొచ్చే సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ను పేర్కొనడం బాలీవుడ్ వాళ్లను మరింతగా బెంబేలెత్తించేదే. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ మీద దండయాత్ర చేసి అక్కడి వాళ్లను మరింత ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేసేలా ఉన్నాడు జక్కన్న. ‘బాహుబలి’ ఏదో ఫ్లూక్ హిట్ అనుకునే వాళ్లు కూడా ఇక మన రాజమౌళి సత్తా ఏంటో పూర్తిగా తెలుసుకుని ఇండియన్ సినిమా నంబర్ వన్ డైరెక్టర్‌గా ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారేమో.