కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తి రెండు రోజుల కిందట హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. శాండిల్‌వుడ్‌లో నంబర్ వన్ హీరో స్థాయిలో ఉండి, వివాద రహితుడిగా.. గొప్ప సేవాభావం ఉన్నవాడిగా గొప్ప పేరున్న పునీత్.. ఇలా ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచిపోవడం ఇంకా ఎవరికీ జీర్ణం కావడం లేదు.
పునీత్ తెలుగు వాడు కాకపోయినా.. తెలుగులో నటించకపోయినా అతణ్ని మనవాడిలా భావించి తెలుగు వాళ్లందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మన ఇండస్ట్రీ జనాలు కూడా పునీత్ మరణం నేపథ్యంలో స్పందించిన తీరు కన్నడిగులను కదిలించింది. ఇండస్ట్రీలో ప్రముఖులందరూ సామాజిక మాధ్యమాల ద్వారా పునీత్ మృతి పట్ల తమ బాధను, అలాగే సంతాపాన్ని ప్రకటించారు.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. పునీత్‌ను టాలీవుడ్ ఇలా ఓన్ చేసుకుని అతడి మరణం పట్ల గొప్పగా స్పందించిన తీరును కన్నడిగులు కొనియాడుతున్నారు. ఐతే అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇలాంటి స్పందన లేకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.
తెలుగుతో సమానంగా తమిళ చిత్రాలు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున విడులవుతుంటాయి. భారీగా వసూళ్లు రాబడుతుంటాయి. పునీత్.. తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం ఉంది. కానీ వాళ్లెవ్వరూ కూడా పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరుకు రాలేదు.
దీంతో తెలుగు స్టార్లు ఇక్కడికి వచ్చిన దృశ్యాలను షేర్ చేస్తూ.. తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ పునీత్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. తమిళ హీరోల సినిమాలను ఇకపై బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తుండటం గమనార్హం.