పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు, ఆయన బాక్సాఫీస్ స్టామినాకు సరైన దర్శకులు సెట్టయి, సరైన సినిమా పడితే వాటి రేంజే వేరుగా ఉంటుంది అనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా ఉంది. అయితే కెరీర్లో పవన్ స్టార్ డైరెక్టర్లతో చాలా తక్కువ సినిమాలు చేశాడు.
చాలా వరకు కొత్త, అప్ కమింగ్, ఫాంలో లేని దర్శకులతోనే సినిమాలు లాగించేశాడు. త్రివిక్రమ్ మినహాయిస్తే పవన్‌తో తరచుగా సినిమాలు చేసిన పెద్ద దర్శకుడెవరూ కనిపించరు. పవన్‌కున్న మాస్ ఇమేజ్, యూత్ ఫాలోయింగ్‌కి రాజమౌళితో ఒక సినిమా చేస్తే దాని కథే వేరుగా ఉండేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఐతే ఇన్నేళ్లలో వీరి కలయికలో ఒక్క సినిమా కూడా రాకపోవడం, భవిష్యత్తులో వచ్చే సంకేతాలు కూడా కనిపించకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే.
పవన్ అయితే రాజమౌళితో సినిమా కోసం అడిగి ఉండడు కానీ.. పవన్ మీద ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చూపిస్తూ ఉండే రాజమౌళి అతడితో సినిమా కోసం ప్రయత్నించకుండా ఏమీ లేదు. కానీ అది వర్కవుట్ కాలేదు. తాజాగా శ్రీకాకుళంలో ఓ మెడికల్ కాలేజీకి సంబంధించిన వేడుకలో పాల్గొన్న రాజమౌళి.. అక్కడ పవన్‌తో సినిమా చేయడం గురించి మాట్లాడాడు.
నిజానికి ఎన్నో ఏళ్ల కిందటే తాను పవన్ కళ్యాణ్‌కు ఒక కథ చెప్పానని.. ఆ తర్వాత ఆయన ఫోన్ చేస్తానన్నారని.. కానీ తన నుంచి కాల్ రాలేదని రాజమౌళి అసలు విషయం వెల్లడించాడు. ఆ తర్వాత పవన్ ట్రాక్ మారిపోయిందని.. తానొక భిన్నమైన ట్రాక్‌లో వెళ్లానని.. అందువల్ల తమ కలయికలో సినిమా రాలేదని రాజమౌళి చెప్పాడు. ప్రస్తుతం తామిద్దరం భిన్నమైన దారుల్లో ఉన్నామని.. అయితే పవన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన్నెంతగానో గౌరవిస్తానని రాజమౌళి చెప్పడం విశేషం.