ఏప్రిల్ కి వెళ్లిన ‘సర్కారు వారి పాట’!

వచ్చే ఏడాది సంక్రాంతిలో సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి రేసుకి సిద్ధమయ్యాయి. రిలీజ్ డేట్స్ ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలు కాకుండా ‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ ఇలా చాలా సినిమాలు సంక్రాంతి డేట్ పై కన్నేశాయి. కానీ ఉన్నట్టుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది యూనిట్.

దీంతో సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లక తప్పదని అందరూ అనుకున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని ఫిక్సయింది. ఇక మిగిలిన సినిమాలు డేట్లు సర్దుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అనీల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్3’ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అధికారికంగా వెల్లడించారు.

ఇక మహేష్, పవన్ సినిమాలను కూడా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 28న ‘సర్కారు వారి పాట’ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే మార్చి 31న ‘భీమ్లా నాయక్’ వస్తుందని అంటున్నారు. అంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక సమ్మర్ లో పాన్ ఇండియా సినిమాలు ఎలాగో ఉంటాయి.