ఆర్యన్ తో చాటింగ్.. డేటా డిలీట్ చేసిన అనన్య పాండే!

దేశ ఆర్ధిక రాజధాని ముంబై తీరంలో క్రూజ్ షిప్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు స్నేహితురాలైన నటి అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో వాట్సాప్ చాటింగ్ లు, ఫోటోలు, వాయిస్ నోట్స్ ను అనన్య పాండే చాలావరకు డిలీట్ చేసినట్లు ఎన్సీబీ గుర్తించింది.

డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించడానికి ఎన్సీబీ ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్ తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్‌లలో కొన్ని అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్ధిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్ తో చాటింగ్ గురించి అనన్య పాండేను ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. కానీ అనన్య మాత్రం ఈ ఆరోపణలన్నీ కొట్టిపారేస్తుంది.

తనకు డ్రగ్స్ అలవాటు లేదని.. డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ కు ఎలాంటి సాయం చేయలేదని.. అతడితో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేవని పేర్కొంది. అయితే ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సప్లై చేసిన వ్యక్తుల గురించి అనన్యకు తెలుసని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోపక్క డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇరవై మందిని అధికారులు అరెస్ట్ చేశారు.