ఓ మై గాడ్.. అక్షయ్ శివుడంట

వరుస సినిమాలకు కమిటవ్వడమే కాదు.. సినిమా సినిమాకీ వేరియేషన్ చూపించి సర్‌‌ప్రైజ్ చేయడంలో అక్షయ్ కుమార్ తర్వాతే ఎవరైనా. సూర్యవంశీ, బచ్చన్‌ పాండే, రక్షాబంధన్, అత్‌రంగీరే, పృథ్విరాజ్, రామ్‌సేతు, మిషన్ సిండ్రెల్లా, గూర్ఖా అంటూ రకరకాల కాన్సెప్టులతో కనువిందు చేయడానికి రెడీ అవుతున్న అక్షయ్.. ‘ఓ మై గాడ్’ సీక్వెల్ కోసం ఏకంగా శివ పరమాత్ముడి అవతారమెత్తాడు.

2012లో అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్’ సినిమా వచ్చింది. సూపర్‌‌ హిట్ కొట్టింది. అదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ హీరోలుగా ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో పవన్‌ కళ్యాణ్ చేసిన దేవుడి పాత్రను హిందీలో అక్కీయే చేశాడు. అయితే మోడర్న్ కృష్ణుడిగా కనిపించాడు. మామూలు డ్రెస్సులే వేసుకుని, అందరిలోనూ కలిసిపోయాడే తప్ప ఎక్కడా కృష్ణావతారంలో కనిపించలేదు. కానీ సీక్వెల్‌లో శివుడిగా సర్‌‌ప్రైజ్ చేయబోతున్నాడు అక్షయ్.

అమిత్ రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పోస్టర్‌‌ని ఇవాళ రిలీజ్ చేశారు. అందులో శివుడి గెటప్‌లో ఉన్నాడు అక్కీ. నువ్వు శివుడి దాసుడివి, విశ్వాసం ఉంచు అనే కొటేషన్‌ పోస్టర్‌‌ మీద రాసి ఉంది. ఓ స్కూలు పిల్లాడు దిగులుగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. మొత్తంగా పోస్టర్‌‌ ఇంటరెస్టింగ్‌గా ఉంది. అక్కీ కాంప్రమైజ్ కాడు కాబట్టి కాన్సెప్ట్ కూడా ఇంటరెస్టింగ్‌గానే ఉండొచ్చనిపిస్తోంది.