సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య తరచుగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రకాష్ రాజ్ పట్ల కోటకు ఉన్న వ్యతిరేకత కొత్తేమీ కాదు కాబట్టి ఆ సంగతి మామూలే అనుకోవచ్చు. ఐతే ఇప్పుడు ప్రకాష్ రాజ్.. యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా రకరకాల విషయాలపై మాట్లాడుతూ.. కోట అనుకోకుండా అనసూయ ప్రస్తావన తెచ్చారు. ఆమె మంచి నటి అని.. చక్కటి హావభావాలు ఇస్తుందని.. చక్కగా డ్యాన్స్ కూడా చేస్తుందని కితాబిస్తూ.. ఆమె డ్రెస్సింగ్ మాత్రం బాగోదని వ్యాఖ్యానించారు. జబర్దస్త్ షోలో ఒకవైపు రోజా నిండైన వస్త్రధారణతో ఉంటే.. అనసూయ మాత్రం అలా ఉండదని, అదొక్కటే అనసూయకు సంబంధించి తనకు నచ్చని విషయం అని వ్యాఖ్యానించారు కోట.
ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో అటు ఇటు తిరిగి అనసూయ దృష్టిలో పడింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా అనసూయ తీవ్రంగానే స్పందిస్తుంటుంది. కోట విషయంలోనూ ఆమె తగ్గలేదు. దీని మీద ఒక పెద్ద మెసేజే పోస్ట్ చేసింది. కోట పేరెత్తకుండానే ఓ సీనియర్ నటుడు తన గురించి ఇలా వ్యాఖ్యానించడం చూశానని.. ఐతే ఇదే నటుడు తెరపై తాగుబోతు పాత్రలు చేయడం.. జుగుప్సాకరమైన బట్టలు వేయడం.. మహిళలపై అఘాయిత్యాలు చేయడం ఎంత వరకు సమర్థనీయం అని ఆమె ప్రశ్నించింది.
మగవాళ్లు ఎలా ఉన్నా ఎవరికీ అభ్యంతరాలుండవని.. కానీ అమ్మాయిల విషయంలోనే ఇవన్నీ వస్తాయని ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరింది. కోటకు మద్దతుగా కామెంట్లు చేసిన వాళ్లందరికీ కూడా అనసూయ తనదైన శైలిలో బదులిచ్చింది. ఆయన మీ గురించి పాజిటివ్ కామెంట్లు కూడా చేశారు కదా అంటే.. ఒక స్టూడెంట్ విషయంలో అన్నీ బాగున్నాయి కానీ, అతడి డ్రెస్సింగ్ బాగోలేదని టీచర్ మార్కులు తక్కువ వేస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉందంటూ అనసూయ వ్యంగ్యంగా స్పందించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates